కూల్చివేతపై స్టేటస్‌కో
- అత్యవసరంగా విచారణ చేపట్టిన హైకోర్టు
- జస్టిస్ వినోద్‌కుమార్ మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, ఆగస్టు 24(విజయక్రాంతి): మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలకు శ్రీకారం చుట్టిన హైడ్రా చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు శనివారం అత్యవసరంగా విచారణ చేపట్టింది. తెలుగు సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వె న్షన్ కూల్చివేత చర్యలను సవాల్ చేస్తూ మేనేజింగ్ డైరెక్టర్ నల్లా ప్రీతమ్ రెడ్డి హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ టీ వినోద్‌కుమార్ విచారణ చేపట్టి, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చర్యలపై స్టేటస్కో (యథాతథస్థితి) ఆర్డర్ జారీచేశారు.
తదుపరి ఉత్తర్వులు జారీచేసేవరకు యథాతథస్థితిని కొనసాగించాలని హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఎన్ కన్వెన్షన్ చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణానికి అను మతి ఇవ్వాలని పిటిషనర్ తరఫు లాయర్ చేసిన వినతిని తోసిపుచ్చారు. ప్రస్తుతం స్టేటస్‌కో ఆర్డర్ ఇస్తున్నామని, ఇరుపక్షాల వాదన లు విన్నాకే ఉత్తర్వుల అంశంపై పరిశీలన చేస్తామన్నారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదావేశారు. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, పట్టణ, మున్సిపల్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్, శేరిలింగంపల్లి జోన ల్ కమిషనర్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఇంజినీర్ ఇన్ చీఫ్, హైడ్రా కమిషనర్లు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు.
‘అక్కినేని నాగార్జున చట్ట ప్రకారం పట్టా భూమిని కొనుగోలు చేసి, నాటి సర్వే ప్రకా రం ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. ఇది 2010 12 మధ్యలో పూర్తయింది. ఎన్ కన్వెషన్ ఉన్న భూమి తుమ్మడికుంట చెరువు సరిహద్దు పరిధిలోకి వచ్చిందని గత కేసీఆర్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ముం దుగా నోటీసు ఇచ్చి తమ వాదన వినిపించుకునే అవకాశం కూడా అధికారులు ఇవ్వలే దు. కనీసం నోటీసు ఇవ్వలేదు. రంగారెడ్డి శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నం 201/1, 11/2, 11/3, 11/36లోని 27,063 చదరపు మీటర్ల స్థలంలో ఎన్ కన్వెన్షన్ ఉంది.
శనివారం ఉదయం 8 గంటల సమయంలో అధికారులు కూల్చివేత చర్య లు ప్రారంభించారు. హైడ్రా ఆకస్మిక చర్య చట్ట వ్యతిరేకం. పిటిషనర్‌కు అక్కడ 6.30 ఎకరాల రిజిస్ట్రర్ భూమి ఉంది. సేల్ డీడ్ల ద్వారా 1992లో కొనుగోలు చేశారు. ఇది పట్టా భూమి. రెవెన్యూ రికార్డుల్లో అక్కినేని నాగార్జున పేరు మీద మ్యుటేషన్ అయ్యింది. అక్కడి చెరువు భూమి ఒక్క అంగుళం కూడా ఆక్రమణ చేయలేదు. భూమి తుమ్మిడికుంట ట్యాంకుకు ఆనుకుని, సర్వే నం.36లో ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ చెరువు పరిధి 20 ఎకరాల 7 గుంటలు. బిల్డింగ్ బైలాస్/జోనల్ నిబంధనల ప్రకారం ఎఫ్‌టీఎల్ పరి ధి 9 మీటర్లు మాత్రమే.
ప్రైవేట్ సర్వే నివేదిక ఆధారంగా తుమ్మిడికుంట చెరువు విస్తీర్ణం 29 ఎకరాలుగా పేర్కొంటూ గత ప్రభుత్వం ప్రొసీడింగ్స్ ఇచ్చింది. దీంతో ఎఫ్‌టీఎల్ పరి ధి 30 మీటర్లకు పెరిగింది. ఈ చెరువు 20.07 ఎకరాలా లేక 29 ఎకరాలా అన్న వివాదం కొలిక్కిరాలేదు. దీనిపై సివిల్ కోర్టు లో వివాదం 2017 నుంచి పెండింగ్‌లో ఉన్నది. ఈ చెరువు విస్తీర్ణం 20.07 ఎకరాలేనని కలెక్టర్ హెచ్‌ఎండీఏ ఇచ్చిన నివేదికపై భూసేకరణ కోర్టు రికార్డుల్లో నమోదు చేసిం ది. ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలను క్రమబద్ధీకరణ చేయాలనే (బీఆర్‌ఎస్) అప్లికేషన్‌ను అధికారులు తిరస్కరించారు.
దీనిపై ఎన్ కన్వెన్షన్ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తే స్టేటస్‌కో ఆర్డర్ 2021లో ఇచ్చింది. స్టేటస్‌కో ఆర్డర్ ఇప్పటికీ అమల్లో ఉండగానే ఇప్పుడు అదే ప్రభుత్వం కూల్చివేత చర్యలకు శ్రీకారం చుట్టింది. అయ్యప్ప సొసైటీ వ్యాజ్యంలో భాగమైన సర్వే నం.11కి సంబంధించిన అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. సుప్రీం కోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు జారీచేసింది. ఎన్ కన్వెన్షన్ కూడా అయ్యప్ప సొసైటీ పరిధిలోనే ఉంది’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీరఘురాం వాదించా రు. వాదనల తర్వాత హైకోర్టు, నోటీసు ఇచ్చిన వెంటనే కూల్చివేత చర్యలను ఎలా ప్రారంభిస్తారని హైడ్రాను ప్రశ్నించింది. నోటీసుకు వివరణ ఇచ్చే గడువు ఇవ్వకపోవ డం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని అభిప్రాయపడింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత పనులు నిలిపివేస్తూ మధ్యంతర స్టేటస్‌కో ఆర్డర్ జారీచేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.






