30 July, 2026 | 5:46 PM

Breaking News

గోల్పర్తిలో విషాదం.. బాధిత కుటుంబానికి అండగా మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   ప్రభుత్వ పాఠశాలలకు యూనిఫాంలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలి   •   ప్రణాళికాబద్ధంగా రాజన్న ఆలయ విస్తరణ పనులు   •   మొదటి వేతనం ఆలయానికి విరాళం   •   సేవలే శాశ్వత గుర్తింపు: సీఎంఓ భీమ్ గొండ   •   నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో 11 మంది ఏఎస్ఐలకు ఎస్‌ఐలుగా పదోన్నతి   •   ఉపాధ్యాయుల సామర్థ్యాభివృద్ధితోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించగలం   •   బైక్ ప్రమాదంలో మహిళ మృతి   •   భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు   •  

కేటీఆర్.. సారీ!

25-08-2024 01:25 AM

మహిళా కమిషన్ ఎదుట బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ హాజరు

మహిళా కాంగ్రెస్ x బీఆర్‌ఎస్ నాయకురాళ్లు

బుద్ధభవన్ వద్ద ఉద్రిక్తత..

కేటీఆర్‌కు రాఖీ.. సభ్యులకు నోటీసులు  

హైదరాబాద్, ఆగస్టు 24 (విజయ క్రాంతి)ః మహిళల పట్ల తాను చేసిన వ్యాఖ్యలకు పశ్చాతాప పడుతున్నానని, వారిని క్షమాపణ కోరుతున్నట్టు మహిళా కమిషన్‌కు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల పట్ల కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమ ముందు హాజరై తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కేటీఆర్‌కు తెలంగాణ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది.

అందులో భాగంగా కేటీఆర్ శనివారం కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారదకు వివరణ పత్రాన్ని అందించారు.తన స్థాయి నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదని అభిప్రాయపడ్డారు. కేటీఆర్ క్షమాపణను స్వీకరించిన కమిషన్ భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని హితవు పలికింది. ఇలాంటివి మళ్లీ జరిగితే మహిళా కమిషన్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుం దని సూచించింది. 

నోటీసులకు సమాధానం ఇచ్చా..

 మహిళలంటే తనకు ఎనలేని గౌరవం ఉందని కేటీఆర్ తెలిపారు. శనివారం మహిళ కమిషన్ ఎదుట హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. యథాలాపంగా తాను చేసిన వ్యాఖ్యలకు ఇది వరకే క్షమాపణలు కోరానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలో మహిళలపై ఆకృత్యాలు భారీగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు జరిగిన సంఘటనల వివరాలతో కమిషన్‌కు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశానని చెప్పారు.

అయితే మరోసారి వచ్చి ఫిర్యాదు చేయాలని కమిషన్ కోరటంతో తప్పకుండా మళ్లీ వచ్చి ఫిర్యాదు చేస్తామన్నారు. తాను ఇచ్చిన సమాధానంపై కమిషన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలని చెప్పారు. తమ పార్టీ నాయకులపై కాంగ్రెస్ మహిళా నేతలు చేసిన దాడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ మహిళ నేతలపై కాంగ్రెస్ మహిళ నేతలు చేసిన దాడిని ఖండించారు. మహిళలపై జరుగుతున్న దాడులపై కూడా కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. 

కార్యాలయం వద్ద ఉద్రికత్త 

 కేటీఆర్ వెంట కమిషన్ కార్యాలయంలోకి బీఆర్‌ఎస్ మహిళా నేతలకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్‌ను కమిషన్ విచారణ చేసినప్పుడు పూర్తిస్థాయి కమిషన్ సభ్యులు, చైర్ పర్సన్ కలిసి విచారించిన సందర్భం గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో దౌర్జన్యాలు, బెదిరింపులు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ క్రమంలో  కాంగ్రెస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షు రాలు సునీతరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ మహిళ నేతలు పెద్ద సంఖ్యలో బుద్దభవన్‌కు చేరుకుని రోడ్డుపై బైఠాయించి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఆయన లోకానికి అవమానించారని మండిపడ్డారు. ఈసందర్భంగా కాంగ్రెస్ మహిళా నేతలు హంగామా సృష్టించే ప్రయత్నం చేశారు. కేటీఆర్‌కు సంఘీభావంగా వచ్చిన బీఆర్‌ఎస్ మహిళ నాయకులపై దాడికి దిగారు. పోటాపోటీ ఆందోళనలతో కార్యాలయం వద్ద ఉద్రికత్త నెలకొంది. రెండు పార్టీ నేతల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పారు. 

 సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలె..

 రాష్ట్రంలో మహిళా ఎమ్మెల్యేలు, మహిళా జర్నలిస్ట్‌లపై జరుగుతున్న దాడులపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీ తా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఒక్క మాట దొర్లినందుకే కేటీఆర్ క్షమాపణ చెప్పి తన హుందాతనాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మహిళా శాసనసభ్యులను అవమానించటంతో పాటు తమ పార్టీ నేతలపై దాడి చేయించారని విమర్శించారు. మహిళలపై తమ పార్టీ నేతకు ఎంతో గౌరవముందని చెప్పారు. 

మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు

 మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన కేటీఆర్‌కు కమిషన్ కార్యాలయంలో సభ్యులు రాఖీ కట్టడంపై చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌కు రాఖీ కట్టిన ఆరుగురు మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు జారీ చేయాలని సెక్రటరీని ఆదేశించారు. సభ్యులకు నోటీసులు ఇవ్వడంతోపాటు న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నామని తెలిపారు. కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సభ్యులను ముందే హెచ్చరించినట్టు తెలిపారు. కమిషన్ ప్రాంగణంలో రాఖీ కట్టిన వీడియో ల ను చిత్రీకరించడంపై సీరియస్ అయ్యారు. మహిళా కమిషన్ విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారని వ్యాఖ్యానించారు. కమిషన్ చర్యలు ఎల్లప్పుడూ మహిళల సమస్యల పరిష్కారం దిశగానే ఉండాలని గుర్తు చేశారు. లీగల్ ఒపీనియన్ తర్వా త వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శారద వెల్లడించారు.