16-10-2025 02:25:01 AM
ముకరంపురా, అక్టోబర్15(విజయక్రాంతి): కవి అన్నవరం దేవేందర్ తన కొత్త కవితా సంపుటి ‘అట్లనే’ ఆవిష్కరణ ఈనెల 17న జరుగుతుందని ‘జీవగడ్డ’ మిత్రుల పక్షా న ఎలగందుల రవీందర్ తెలిపారు. హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలోని ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి ‘చావడి’ వేదికలో మధ్యా హ్నం 3 గంటలకు సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు.
ముఖ్య అతిథి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఘంటా చక్రపాణి పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ ప్రెస్ అకాడ మీ పూర్వ అధ్యక్షుడు అల్లం నారాయణ ‘అట్లనే’ కృతిని అంకితం స్వీకరిస్తారు. విశిష్ట అతిథిగా ప్రముఖ సంపాదకులు కే శ్రీనివాస్ హాజరవుతారు. సమావేశ అధ్యక్షుడిగా సార్వత్రిక విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షు లు రజనీ నెల్లుట్ల వ్యవహరిస్తారు.
ఈ సమావేశం 1985లో బి విజయకుమార్ నేతృత్వం లో వెలవడ్డ ’ జీవగడ్డ’ దిన పత్రిక మిత్రు లు నిర్వహిస్తున్నారు. దాశరధి కృష్ణమాచార్య పురస్కార గ్రహీత , కవి అన్నవరం దేవేందర్ కు ఇది 13 వ కవితా సంపుటి . ఇవిగాక గతంలో మూడు ఆంగ్ల అనువాద కవితా సంపుటాలు 4 వ్యాసాల పుస్తకాలు కూడా వెలువరించారు.