27 February, 2026 | 4:41 AM

పక్కాగా ధాన్యం లెక్క

27-02-2026 12:56 AM

మిల్లర్ల మాయాజాలంపై మంత్రి ఉత్తమ్ సీరియస్

ప్రత్యేక బృందాలతో స్టాక్ తనిఖీలకు మంత్రి ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్, ఎఫ్‌సీఐ బృందాలతో వేర్వేరుగా తనిఖీలు

2024-25 రబీ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం 70% బియ్యాన్నే ఇచ్చిన మిల్లర్లు

2025-26 ఖరీఫ్ సీజన్‌లో 15% లోపే సీఎంఆర్ సరఫరా

హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క.. అనే రీతిలో పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కఠినంగా వ్యవహరిస్తున్నారు. పౌర సరఫరాల విభాగాన్ని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో మంత్రి పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా.. 2024- 25 రబీ సీజన్‌లో మిల్లర్ల నుంచి రావాల్సిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

మిల్లర్ల వద్ద నుంచే ధాన్యం మాయమవుతున్నదని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. అసలు ధాన్యం స్టాక్ ఉందా, ఉంటే ఎంత ఉంది.. ఇంకెంత సీఎంఆర్ రావాల్సి ఉందనే పక్కా సమాచారాన్ని రాబట్టేందుకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ బృందాలతోపాటు, ఎఫ్‌సీఐ బృందాలు కూడా ఈ స్టాక్ తనిఖీల్లో వేర్వేరుగా పాలుపంచుకుంటున్నాయి.

28తో గడువు ముగింపు..

-25 సీజన్‌లో రబీ పంటకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 8,378 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిల్లులకు మిల్లింగ్ కోసం సరఫరా చేసింది. అయితే ఇందు లో ఇప్పటివరకు సుమారు 70 శాతం వరకు మాత్రమే కస్టమ్ మిల్లింగ్ రైస్ రూపంలో ప్రభుత్వ గోదాములకు చేరుకుంది. మిగిలిన 30 శాతం బియ్యం రావాల్సి ఉంది. అయితే 2024 సీజన్‌లో రబీకి సంబంధించిన సీఎంఆర్ ఇవ్వడానికి గడువు ఈనెల 28తో ముగియనుంది.

ఈ నేపథ్యంలో మిల్లర్లు తమకు మరింత గడువు కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే విషయమై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాజాగా ఢిల్లీ పర్యటనలో భాగంగా 2024-25 రబీ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ ఇవ్వడానికి మరో 2 నెలల గడువు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయితే క్షేత్రస్థాయిలో ధాన్యం నిల్వలు ఉన్నాయా, ఉంటే అవి ఏ మేరకు ఉన్నాయనే అంశాన్ని నిర్ధారిస్తేనే గడువు పెంచేందుకు అవకాశం ఉంటుందని కేంద్రంలోని అధికారులు స్పష్టంచేశారు. 

స్పష్టమైన ఆదేశం..

ఇప్పటికే మిల్లర్లు ధాన్యం నిల్వలను మా యం చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినపడుతున్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి దీనిపై దృష్టి సారించారు. పౌర సరఫరా ల విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని కంకణం కట్టుకున్న మంత్రి ఉత్తమ్.. ఇదే అదనుగా అసలు ధాన్యం నిల్వలు ఎన్ని ఉన్నా యో తనీఖీలు చేసి తేల్చాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్ బృందాలను ఈ తనిఖీలకు పురమాయించారు.

పైగా తనిఖీలకు వెళ్ళే బృందాలు వారి సొంత జిల్లాల్లో కాకుండా.. ఇతర జిల్లాలకు వెళ్ళాలని, రైస్ మిల్లర్లు చేసే మర్యాదలను తృణీకరించాలని స్పష్టంగా చెప్పడంతో.. ఆయా బృందాలు సొంతంగా ఏర్పాటు చేసుకుని మరీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2024 రబీ సీజన్‌లో 74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లకు ఇస్తే.. ఇప్పటివరకు అందులో నుంచి సుమా రు 70 శాతం వరకు బియ్యం రూపంలో ప్రభుత్వ గోదాములకు చేరింది.

మిగిలిన ధాన్యం ఆయా మిల్లుల్లో ఉందా.. లేదా అనేది ఈ తనిఖీలు ముగిసిన తరువాత తేలనుంది. ఆయా మిల్లులకు కేటాయించిన ధాన్యం ఎం త?, సరఫరా చేసిన సీఎంఆర్ ఎంత?.. మిగిలి న ధాన్యం ఉందా లేదా.. అనేది మిల్లుల వారీ గా తేల్చనున్నారు. ఒకవేళ ధాన్యం మాయమైతే.. ఆయా మిల్లులపై కేసులు కూడా నమోదు చేయాలని మంత్రి ఉత్తమ్ స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో టాస్క్‌ఫోర్స్ బృం దాలు ఆ పనిలో నిమగ్నమయ్యాయి.

మరోవంక ఎఫ్‌సీఐ బృందాలు..

ఇదిలా ఉండగా.. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) బృందాలు కూడా మిల్లుల్లో ధాన్యం నిల్వల తనిఖీలకు బయలుదేరాయి. ఇటు టాస్క్‌ఫోర్స్, అటు ఎఫ్‌సీఐ బృందాల తనిఖీల్లో 2024-25 రబీ సీజన్ ధాన్యం నిల్వలు, మరోవంక 2025-26 ఖరీఫ్ సీజన్‌లో సేకరించిన 71.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో ఎంతవరకు మిల్లర్ల వద్ద ఉన్నాయనేది తేల్చనున్నారు. 2025-26 ఖరీఫ్‌కు సంబంధించి ఇప్పటివరకు కేవలం 10 నుంచి 15 శాతం మాత్రమే సీఎంఆర్ బియ్యం ఇచ్చారు.

పూర్తిగా సీఎంఆర్ ఇవ్వడానికి గడువు ఇంకా ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తేనే మిల్లర్లు ధాన్యాన్ని మాయం చేసే అవకాశం ఉండదని, అందుకు  అనుగుణంగానే ఇటు టాస్క్‌ఫోర్స్, మరోవంక ఎఫ్‌సీఐ బృందాలతో తనిఖీలు చేయిస్తున్నారు. మొత్తానికి పౌర సరఫరాల శాఖ పర్యవేక్షణ, నిఘా మరింతగా పెరిగితేనే మిల్లర్ల మాయాజాలానికి చెక్ పెట్టవచ్చని ఆలోచించిన మంత్రి ఉత్తమ్.. అందుకు అనుగుణంగా కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు.