13 July, 2026 | 1:42 PM

తమిళనాడుకు మరో అంతర్జాతీయ విమానాశ్రయం

28-06-2024 01:12 AM
  1. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం స్టాలిన్
  2. పారిశ్రామిక కేంద్రం హోసూరులో ఏర్పాటుకు నిర్ణయం

చెన్నై, జూన్ 27: తమిళనాడులో మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించే ప్రణాళికను అసెంబ్లీ వేదికగా ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు ఉండ గా హోసూరులో మరో విమానాశ్రయాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు. హోసూరులో 2 వేల ఎకరాల్లో ఏడాదికి 3 కోట్ల మంది ప్రయాణీకులకు సేవలందించే సామర్థ్యంతో నిర్మించనున్నట్లు తెలిపారు. హోసూరుతో పాటు నగరం చుట్టుపక్కల అనేక పరిశ్రమలు ఉన్నందున పెట్టుబడులు, ఉపాధికి ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నగరం ఇప్పటికే మంచి కనెక్టివిటీ కలిగి ఉంది. చెన్నై, తిరువళ్లూరు, శ్రీపెరంబుదూరు, కోయంబత్తూర్ సహా ఇతర ప్రధాన వ్యాపార, పారిశ్రామిక కేంద్రాలకు హోసూర్ సమీపంలో ఉంది. హోసూరులో టాటా ఎలక్ట్రానిక్స్, టీవీఎస్, అశోక్ లేలాండ్, టైటాన్, రోల్స్‌రాయిస్ వంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.