ఆర్టీసీకి మరో యూనియన్ సమ్మె నోటీసు
ఈనెల 7న యాజమాన్యానికి అందజేత
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసు ఇవ్వగా.. తాజాగా మరో కార్మిక సంఘం కూడా సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన డేటాఫ్ అపాయింట్‌మెంట్, ట్రేడ్ యూనియన్ల అనుమతి, వేతన సవరణ సహా అనేక సమస్యల సాధనకు తెలంగాణ జాతీ య మజ్దూర్ యూనియన్ (టీజేఎంయూ) ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు బస్ భవన్‌లో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వడానికి రాష్ర్ట కమిటీ నిర్ణయించిందని యూనియన్ వ్యవస్థాపక రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కే హనుమంతు ముదిరాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సమ్మె నోటీ సు ఇస్తున్న సందర్భంగా రాష్ర్టవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి కార్మికులు భారీగా హాజరుకావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసుతో సతమతమవుతున్న యాజమాన్యానికి ఇప్పుడు మరో యూనియన్ నోటీసు ఇస్తుండటంతో కార్మికులంతా సమ్మెకు ఏకతాటిపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.






