ఫార్మా మాఫియా
ఫ్యాక్టరీలకు వరంగా అధికారుల నిర్లక్ష్యం..
యాజమాన్యాల లాభాపేక్ష
పరిశ్రమలు కావు.. మృత్యుకుహరాలు
- మామూళ్ల మత్తులో ఫ్యాక్టరీల శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్
- పర్యవేక్షణ కరువై.. బలవుతున్న కార్మికులు
- ఆడిట్ నివేదికలు కాగితాలకే పరిమితం
- ప్రమాదం జరిగినప్పుడే స్పందిస్తున్నట్టుగా నాటకాలు
- ఇదీ.. సంగారెడ్డి జిల్లా పారిశ్రామికవాడల కహానీ
* ఒక వైపు పరిశ్రమల లాభాపేక్ష.. మరో వైపు అంతకుమించిన ప్రభుత్వ వైఫల్యం.. సంగారెడ్డి జిల్లా ఫార్మా హబ్‌లో పరిశ్రమలు కార్మికుల పాలిట మృత్యుకుహరాలుగా మారడానికి కారణమయ్యాయి. పటాన్‌చెరు, బొల్లారం, జిన్నారం, పాశమైలారం, సదాశివపేట పారిశ్రామిక ప్రాంతాల్లో యాజమాన్యాలు ఆడిందే ఆట.. పాడిందే పాట. యాజమాన్యాల లాభాపేక్షకు తోడు ప్రభుత్వ నిఘా విభాగాల వైఫల్యం, చేష్టలుడిగిన అధికార యంత్రాంగం కార్మికుల ప్రాణాలకు యమపాశాలు బిగిస్తున్నాయి.
ఈ ఫార్మా హబ్‌లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, కాలం చెల్లిన యంత్రాలను వాడటం, రియాక్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం వల్ల వరుసగా పేలుళ్లు సంభవిస్తున్నాయి. ఇటీవల మైత్రి డ్రగ్స్ ల్యాబ్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ కార్మికుడు మృతి చెందిన ఘటన జిల్లావ్యాప్తంగా కార్మికుల రక్షణపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది.
జిల్లాలోని పారిశ్రామిక హాట్‌స్పాట్‌లలో నిరంతరం పొంచి ఉన్న ముప్పును పసిగట్టి, నివారించాల్సిన బాధ్యత కలిగిన ఫ్యాక్టరీలశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఆరోగ్య-భద్రతా విభాగాలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేయడం, ఆ తర్వాత మామూళ్ల మత్తులో జోగడం అధికారులకు నిత్యకృత్యంగా మారింది.
సంగారెడ్డి, జూన్ 12 (విజయక్రాంతి): తనిఖీలు లేవు.. అంతా ఆన్‌లైన్ మాయాజా లం. ఫ్యాక్టరీల చట్టం 1948 ప్రకారం ప్రమాదకర రసాయనాలు ఉపయోగించే ప్రతి పరి శ్రమలో భద్రతా ప్రమాణాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. కానీ జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలనలు శూన్యం.
జిల్లాలో వందలాది కెమికల్, ఫార్మా కంపెనీలు ఉన్నా, వాటిని తనిఖీ చేయడానికి తగినంత మంది ఇన్‌స్పెక్టర్లు లేరనే సాకుతో అధికారు లు చేతులు దులుపుకుంటున్నారు. ఒకవేళ ఉన్నతాధికారుల ఆదేశాలతో తనిఖీలకు వచ్చినా, ఆ సమాచారం ముందే యాజమాన్యాలకు చేరిపోతోంది. దీంతో అధికారులు వెళ్లేసరికి తాత్కాలికంగా అన్ని భద్రతా ఏర్పాట్లు సరిగ్గా ఉన్నట్లు కంపెనీలు నాటకమాడుతున్నాయి.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ప్రభుత్వం తెచ్చిన సరళీకృత నిబంధనలను అధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. కంపెనీలు ఇచ్చే అబద్ధపు సేఫ్టీ రిపోర్టులను కనీసం సరిచూడకుండానే ఆమోది స్తున్నారు. ఫార్మా కంపెనీల్లో రియాక్టర్ల పేలుళ్లకు ప్రధాన కారణం మితిమీరిన రసాయన ఒత్తిడి, గ్యాస్ లీకేజీలు. నిబంధనల ప్రకారం టాక్సిక్ గ్యాస్ డిటెక్టర్లు నిరంతరం రికార్డు కావాలి.
కానీ మెజారిటీ కంపెనీల్లో ఇవి మూలనపడ్డా పీసీబీ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో దాదాపు 300 పైగా ప్రమాదకర కెమికల్, ఫార్మా పరిశ్రమలు ఉంటే గత ఏడాది కాలంలో ఫ్యాక్టరీల శాఖ కేవలం 15 శాతం కంపెనీలలో మాత్రమే కనీస తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. 85 శాతం కంపెనీలు ‘సెల్ఫ్ సర్టిఫికేషన్’ పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
రాత్రి వేళల్లోనే అసలు దందా
పగటిపూట నిబంధనలు పాటించినట్లు నటించే యా జమాన్యాలు, రాత్రి వేళల్లో ప్రమాదకర వ్యర్థాలను, విష వాయువులను వదులుతున్నాయి. దీనివల్ల రియాక్టర్లపై లోడ్ పెరిగి పేలుళ్లకు దారితీస్తోంది. స్థానిక ప్రజలు ఫిర్యాదులు చేసినా పీసీబీ అధికారులు కనీసం స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏటా థర్డ్ పార్టీతో నిర్వహించాల్సిన పారిశ్రామిక సేఫ్టీ ఆడిట్లు కేవలం కాగితాల మీదనే నడుస్తున్నాయి.
కొందరు ప్రైవేట్ సేఫ్టీ ఆడిటర్లతో కంపెనీలు కుమ్మక్కు, క్షేత్రస్థాయిలో లోపాలున్నా ‘ఆల్ ఈజ్ వెల్’ అంటూ సర్టిఫికేట్లు పొందుతున్నాయి. ఈ నకి లీ నివేదికలను ప్రభుత్వ అధికారులు గుడ్డిగా నమ్ముతున్నారు. ఏదైనా కంపెనీలో లోపాలు గుర్తిస్తే విధించే జరిమానాలు కొన్ని వేల రూపాయల్లోనే ఉంటున్నాయి. కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న ఫార్మా కంపెనీలకు ఈ జరిమానాలు చాలా తక్కువ మొత్తం కావడంతో, వారు భద్రతపై పెట్టుబడి పెట్టడానికి బదులు జరిమానాలు కట్టడానికే మొగ్గు చూపుతున్నారు.
‘రాజీ’ కుదుర్చడంలోనే బిజీ
ఒక కార్మికుడు చనిపోయినప్పుడు లేదా తీవ్రంగా గాయపడినప్పుడు, చట్టప్రకారం కంపెనీపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సీజ్ చేయాలి. కానీ కార్మిక శాఖ అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేసి యాజమాన్యానికి అనుకూలంగా మారుతున్నారు. బాధిత కుటుంబాల కు ఐదు లేదా పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇప్పించి, కేసును నీరుగార్చేందుకు మధ్యవర్తులుగా మారుతున్నారు. రియాక్టర్ పేలడం వల్ల చనిపోతే, దానిని సాధారణ గుండెపోటుగా లేదా కార్మికుడి సొంత నిర్లక్ష్యంగా చిత్రీకరించేందుకు నివేదికలను తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.






