హైదరాబాద్ బయట మరో జూపార్క్
హైదరాబాద్: హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో స్పీడ్‌పై (స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ) ప్రాజెక్టులపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హెల్త్,ఎకో టూరిజం ప్రాజెక్టులు, టెంపుల్ సర్క్యూట్‌ల అభివృద్ధి పై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి నూతన విధానం రూపొందించాలని సీఎం సూచించారు. ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఎకో, టెంపుల్ పర్యాటక అభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని తెలిపారు. అవసరమైనచోట పీపీపీ విధానాన్ని అవలంభించాలని చెప్పారు. హెలీ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం వెల్లడించారు.






