మరో రెండు రోజులు వర్షాలు
పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు
ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం
శుక్రవారం పలు జిల్లాల్లో కురిసిన మోస్తరు వర్షం
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రం లో వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం పల్లు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. శని, ఆదివా రాల్లోనూ రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.
శుక్రవారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామా రెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, భూపాలపల్లి, హనుమకొండ, ములుగు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాపాతం నమోదవగా, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, వరంగల్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.
శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌బాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.
ఆదివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లోనూ..
వాయవ్య బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ అధికారులు తెలిపారు. ఇది రాబోయే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 40- కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేఘావృతమైన వాతావరణంతో పలు జిల్లాల్లో పిడుగు లతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.






