ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలబెడతా
తిరుమల: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అర్చకులు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... నేటి నుంచి ఏపీలో ప్రజాపాలన మొదలైందన్నారు. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సీఎం తెలిపారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలన్న ఆయన ఏపీని దేశంలో మొదటి స్థానంలో నిలబెడతానని పేర్కొన్నారు.
సంపద సృష్టించాలి.. పేదవాళ్లకు చేరాలన్నదే తన లక్ష్యం అన్నారు. పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చాలన్నారు. ఆర్థిక అసమానతలను తొలగించడమే తమ ధ్యేయమన్నారు. నేరాలు చేసి తప్పించుకోవాలంటే కుదరదన్నారు. కొందరు దాడులు చేసి మళ్లీ తమ మీద ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిపాలనలో ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తానన్న చంద్రబాబు తిరుమలను అపవిత్రం చేయడం భావ్యం కాదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.






