25 March, 2026 | 5:56 AM

టేబుల్ టెన్నిస్‌కు అర్చన గుడ్ బై

23-08-2024 12:16 AM

న్యూఢిల్లీ: భారత యువ ప్యాడ్లర్ అర్చనా కామత్ టేబుల్ టెన్నిస్ (టీటీ)కు వీడ్కోలు పలికింది. మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాకు పయనం కానున్న అర్చన టీటీ గేమ్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఆమె కోచ్ తెలిపాడు. ఈ మేరకు గురువారం బాధాతప్త హృదయంతో అర్చన్ టీటీకి టాటా చెప్పేసింది. ఇటీవలే పారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ మహిళల టీం విభాగంలో భారత్ క్వార్టర్స్ చేరి చరిత్ర సృష్టించింది. ఈ ఘనత సాధించిన తొలి భారత జట్టుగా రికార్డులకెక్కింది. మనికా బత్రా, ఆకుల శ్రీజ, అర్చన బృందం క్వార్టర్స్‌లో జర్మనీ చేతిలో ఓడింది.

అయితే ఆ మ్యాచ్‌లో భారత్ తరఫున గెలిచింది అర్చనా కామత్ మాత్రమే.  పారిస్ గేమ్స్ ముగించుకొని భారత్‌కు తిరిగొచ్చిన అర్చన ఆ తర్వాత తన కెరీర్ గురించి కోచ్ అన్షుల్ గార్గ్‌తో సుధీర్ఘంగా చర్చించింది. నాలుగేళ్ల తర్వాత లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నిర్థారణకు వచ్చిన అర్చన ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆటకు దూరంగా ఉండాలని భావించింది.

దీంతో ఆటకు గుడ్ బై చెప్పి అమెరికాలోని మిషిగాన్ యునివర్సిటీలో పబ్లిక్ పాలసీ (ఎకనామిక్స్)లో మాస్టర్స్ చేయాలని నిశ్చయించుకుంది. ‘టీటీని ఎంత ఇష్టపడుతానో.. చదువు కూడా అంతే ఇష్టం. ఒలింపిక్స్‌లో క్వార్టర్స్ చేరి చరిత్ర సృష్టించాం.అది ముగియడంతో చదువుపై దృష్టి సారించాలనుకున్నా’ అని అర్చన వెల్లడించింది.