‘ఉచితాలు’ సముచితమా?
ఎన్నికల వేళ ప్రతి పార్టీ అలవికాని హామీలు ఇస్తున్నాయి. ఉచితాల పేరుతో పలు పథకాలను ప్రకటిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఇచ్చిన హామీలే ఇందుకు ఉదాహరణ. బడ్జెట్ అత్యధిక భాగం ఈ హామీల అమలుకే ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో రోడ్లు, తాగు, సాగునీటి పథకాలు లాంటి ప్రజోపయోగ పథకాలకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? అభివృద్ధి పథకాలు అమలు చేస్తేనే ఏ రాష్ట్రమైనా ప్రగతిని సాధించి ప్రజల జీవన పరిస్థితులు మెరుగు పడతాయి. పార్టీలు ఈ విషయాన్ని గ్రహించి ఉచితాల విషయంలో కొంత సంయమనం పాటిస్తే బాగుంటుంది.
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఉచితాల ప్రకటనలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ బిసీ మైనారిటీలకు 4 వేల పెన్ష న్ ఇస్తామని, బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ ఏటా 15 వేలు, 19 ఏళ్ల నుండి 59 వయసున్న ప్రతీ మహిళకు నెలకు రూ.1,500, ప్రతీ రైతుకు ఏటా రూ.20 వేలు, నిరుద్యో గ యువతకు నెలకు రూ.3 వేలు ఇస్తామని ప్రకటించారు.
ఇంకా, ఒక్కో కుటుంబానికి రూ.25 లక్ష ల ఆరోగ్య బీమా, ఏటా చేనేత కుటుంబానికి రూ.24 వేల ఆర్థిక సహాయం, పూజా రులకు నెలకు రూ.15 వేలు, ఉచితంగా ఇసుక రవాణా, బిపి, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత మందులు, ఏడాదికి నాలుగు లక్షల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు.. ఇంకా చాలా చాలా వున్నాయి. ఇదంతా ప్రజలను సోమరిపోతులను చెయ్యడానికి తప్ప వారి శారీరక శ్రమని, మానసిక దృఢత్వాన్ని ఉపయోగించుకునే పథకాలు అస్సలు కావు.
- అభివృద్ధికి చోటు ఎక్కడ?
- ‘సంపద పెంచుదాేం ప్రజలకు పంచు దాం’ నినాదంలో చంద్రబాబు ప్రకటించి న పథకాల్లో సంపద పెంచే పథకం ఒక్కటీ లేదు. ప్రజలు కట్టే టాక్స్ సొమ్మును మాత్రం ప్రజలకు ఉచితంగా పంచుదా మని మాత్రమే ఉంది. సంపద పెంచే కొత్త ప్రాజెక్టుల పథకాలు కానీ, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం గానీ, నూతన పరిశ్రమల స్థాపన గానీ, కొత్త ఉద్యోగాల కల్పనగానీ ఆ ప్రకటనల్లో లేవు. ప్రజలు చెల్లించే పన్నును ఉచితాల పేరు తో ప్రజలకు పంచినపుడు అభివృద్ధికి చోటు ఎక్కడ వుంటుంది. ప్రజలకు అవసరమైన తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, పోలీసు, అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతికత ప్రగతి గురించి చంద్రబాబు ప్రకటించిన వాటిలో లేవు. ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోవాలనే కసి, ద్వేషం, ఉక్రోషంతో ప్రజలను రెచ్చగొట్టి పదవిలోకి రావడమే లక్ష్యంగా చంద్రబాబు అండ్ కో ప్రకటనలు ఉన్నాయి. ఇక, జగన్ పార్టీ వైసీపీ కూడా సంక్షేమం పేరుతో ఉచిత పథకాలకే పెద్దపీట వేసింది తప్ప అభివృద్ధి గురించి మాట్లాడలేదు.
అప్పులు లేకుండా పాలన చేయాలి
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణంలో ఆర్టీసి కొన్ని వందల కోట్లు ఏటా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు జనాభా, ప్రజల అవసరాలు పెరుగుతున్న ఈ సమయంలో కొత్త బస్సుల ఆవశ్యకత, సిబ్బంది నియామకం, కొత్త రూట్ల సంగతి గాలికి వదిలేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రకటించిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ సాధ్యమయ్యే పనేనా? సుమారు 73 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. ఇన్ని లక్ష ల మందికి రుణమాఫీ చేయాలంటే రాష్ట్ర బడ్జెట్‌లో ముప్పావు భాగం పోతుం ది. మరి, మిగతా అభివృద్ధి, సంక్షేమం మాటేమిటి? ప్రజలకు చేసిన ఛాలెంజ్ ను తీరుస్తాను అనే మొండి ధైర్యంతో రుణమాఫీ చేస్తే కేంద్రం నుండి రేపు మరిన్ని వేల కోట్ల అప్పులు రాష్ట్రం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వాల అప్పులను చూపిస్తూ అధికారంలోకి వచ్చినపుడు నిజంగానే అప్పులు చేయకుండా పాలన సాగించి ప్రజల మన్ననలను పొందాలి.
50 ఏళ్లకే పెన్షన్ అంటే ఎలా?
ప్రభుత్వం నుండి ప్రజలు ఏదీ ఉచితంగా పొందాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రభుత్వమే పేద బలహీన వర్గాలకు సబ్సిడీమీద ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, రైతులకు సబ్సి డీపై విత్తనాలు, ఎరువులు అందించాలని, 65 ఏళ్ళు దాటిన వృద్ధులకు నెలకు కొంత సొమ్ము వారి జీవనోపాధికి అందించాలని న్యాయమైన కొన్ని సమస్యలకు ప్రభుత్వం స్వీకారం చుట్టింది. అంతేకానీ, మనిషి సగటు ఆరోగ్య వయసు ఈ రోజుల్లో 75 ఏళ్ళు వుంటున్నపుడు, 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామంటే, ఆరోగ్యంగా ఉండే వీరు మానసికంగా వృద్ధులుగా మారిపోయే అవకాశం ఉంటుంది.
సమగ్ర ఆర్థిక సర్వే అవసరం
గత రెండు దశాబ్దాల కాలంలో రాజకీయాలు వికృతంగా మారిపోయాయి. ఎన్నికల్లో గెలవాలనే స్వార్థంతో నోటికి ఏది పడితే అది ఉచితంగా ఇస్తామనడం తో ప్రజలు కూడా వీటికి అలవాటు పడ్డా రు. సమగ్ర ఆర్థిక సర్వే చేయకుండా ఎవరు ఏ పథకానికి నిజమైన లబ్ధిదారులో ప్రభుత్వానికి లెక్క తేలదు. సంవత్సరానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందోకూడా లెక్క రాదు. సమగ్ర ఆర్థిక సర్వే చేయకుండా కేవలం వైట్ రేషన్ కార్డుదారులకే అన్ని పథకాలు అంటే, కార్డు లేని నిరుపేదల సంగతేమిటి? వైట్ రేషన్ కార్డుదారుల్లో కూడా కోటీశ్వరులు వున్నారు. నాయకులు తమ స్వార్థం కోసం ప్రకటనలు చేసినప్పటికీ ప్రభుత్వ యంత్రాం గంలో పనిచేసే మేధావివర్గంగా చెప్పుకునే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయ నిపుణులు ఉచితాల ప్రకటనలపై నాయకులకు నిజమైన సలహాలు ఇవ్వాలి. ప్రభు త్వంపై పడే ఈ భారం భవిష్యత్తులో రాష్ట్రం మెడకు చుట్టుకుంటుందనే విషయాన్ని వారికి తెలియచేయాలి. అప్పుడే వీరి మేధాశక్తికి విలువ ఉంటుంది.
ప్రజలు నాయకులను నమ్మాలి
రాష్ట్రాలు ఉచితాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ‘రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా’ నొక్కి చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్లు రఘురాం రాజన్, ఉర్జిత్ పటేల్ కూడా ఉచితాలను వ్యతిరేకించారు. రాష్ట్రాలకు అప్పులు ఇవ్వడంలో కూడా రిజర్వ్ బ్యాంకు అనేక మెలికలు పెడుతూ వస్తోంది. అయినాసరే, నాయకులు ఉచితాలు ప్రకటించడం తగ్గించలేదు. ఉపాధిని పెంచే పథకాల వల్ల ప్రజలతోపాటు రాష్ట్రం బాగు పడుతుంది కానీ, లేదంటే ఉభయ తెలుగు రాష్ట్రాలు వారి శారీరక శ్ర మని మరిచిపోయి, ప్రభుత్వం ఇస్తేనే తిండి తినే రోజులు రాకూడదు. ఉచితాలకు బదులు ‘ఇన్ని ప్రాజెక్టులు కట్టిస్తాను, ఇన్ని పాఠశాలలు, కళాశాలలు కొత్తగా ఏర్పాటు చేస్తాం, ఇన్ని రోడ్లు వేయిస్తాం, ఇన్ని కొత్త పరిశ్రమలను స్థాపిస్తాం, యువతకు ఉపాధి కల్పిస్తాం’ అని చెబితే ప్రజలు వాటిని ఇంకా బాగా స్వీకరిస్తారు. చెప్పిన పనులు ఆచరణలో చేసి చూపినప్పుడు ప్రజలు ఆ పార్టీ నాయకులను గుండెల్లో పెట్టుకుంటారు. నాయకులను ప్రజలు నమ్మడం కాదు, ప్రజలు నాయకులను నమ్మే రోజులు రావాలి.






