21 June, 2026 | 1:37 AM

హిందువులు మెజారిటీ కాదా?

21-06-2026 12:00 AM

భారతదేశంలో హిందువులు ఇకపై ఏ మాత్రం మెజారిటీ కాదని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) సీనియర్ సభ్యుడు, అధికార ప్రతినిధి ఖలీలుర్ రహ్మాన్ సజ్జాద్ నోమాని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలు దేశంలో మతపరమైన, రాజకీయంగా ఉద్రిక్తతలను రాజేశాయి. 2026 ఫిబ్రవరిలో ఓ సదస్సులో చేసిన ఈ వ్యాఖ్యలు తాజాగా జూన్‌లో మళ్లీ వైరల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు దీనిపై తీవ్రంగా స్పందించారు. అంతేకాదు, సీనియర్ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి టీవీ డిటేట్‌లోనూ ఈ అంశాన్ని ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

భారతదేశంలో ఉన్న విభిన్న సామాజిక, కుల, ప్రాంతీయ గుర్తింపులను పరిగణనలోకి తీసుకుంటే హిందువులను చట్టబద్ధంగా మెజారిటీ సమాజంగా పరిగణించలేమని నోమాని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు, లింగాయత్‌లు, సిక్కులు, జాట్‌లు, తమిళులు, ఆదివాసీలు తదితర వర్గాలను హిందువులుగా పరిగణించకూడదనేది ఆయన వాదన. అంతేకాదు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు వేర్వేరు సమాజాలని, దేశంలో అనేక వర్గాలు ప్రత్యేక గుర్తిం పులను కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు.

అయితే, నోమాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. మత, సామాజిక అంశాలపై ఆయన గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హిందూ సమాజాన్ని కుల, ప్రాంతీయపరంగా విభజించడానికి ఉద్దేశించిన వ్యూహంగా విమర్శకులు ఆయన వ్యాఖ్యలను చూస్తున్నారు. భారత్‌లో అతిపెద్ద సమాజంగా హిందువులను గుర్తించే రాజ్యాంగపరమైన చర్యలు, జనాభా వాస్తవాలను బలహీనపరిచే ప్రయత్నమని వారు ఆరోపిస్తున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో హిందువులు సుమారు 79.8 శాతం ఉన్నారు. ‘వ్యూ’ సంస్థ నివేదిక ప్రకారం 2050 నాటికి హిందువుల జనాభా 77 నుంచి 79 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే నోమాని మాత్రం దశాబ్దాలుగా తాను చేసిన క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగా ఈ గణాంకాలను ఉప వర్గాలుగా విడదీసి చూడాలని వాదిస్తున్నారు.

రాజకీయంగా తీవ్ర ప్రతిస్పందనలు

బీజేపీ, దాని మిత్రపక్షాలు నోమాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. షెహజాద్ పూనావాలా ఈ వ్యాఖ్యలను జిహాదీ మనస్తత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. హిందూ ఐక్యతను బలహీనపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారని మరికొందరు నాయకులు వాదించారు.

ఈ వ్యాఖ్యలను విద్వేష ప్రసంగంగా లేదా విభజనను ప్రేరేపించే ప్రయత్నంగా అభివర్ణిస్తూ, నోమానిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేవారు. మరోవైపు ప్రతిపక్షాలతోపాటు కొందరు విశ్లేషకులు మాత్రం భిన్నా భిప్రాయం వ్యక్తం చేశారు. హిందూ సమాజంలో కుల వివక్ష వంటి సామాజిక వాస్త వాలపై మైనారిటీ వర్గాలు వ్యక్తం చేసే అభిప్రాయాలను అణచివేసేందుకు ఈ వివాదాన్ని అతిగా చూపిస్తున్నారని వారు వాదించారు.

అయితే, భారత్‌లో మతపరమైన గణాంకాలు, గుర్తింపు రాజకీయాలు, పాలనా సంస్కరణల చుట్టూ చర్చలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. నో మాని అభిప్రాయాన్ని సమర్థించేవారు ఆయ న నిజమైన సామాజిక భేదాలను మాత్రమే ప్రస్తావించారని వాదిస్తున్నారు. కర్ణాటకలో లింగాయత్‌లు చారిత్రకంగా ప్రత్యేక మత హోదాను కోరుతున్న విషయం విదితమే. అనేక దళిత, గిరిజన వర్గాలు ప్రత్యేక సంప్రదాయాలను కొనసాగిస్తున్నాయి.

అలాగే రాజ్యాంగపరంగా సిక్కు ప్రత్యేక మతంగా గుర్తింపు పొందింది. అయితే విమర్శకులు మాత్రం ఈ వాదనలను తిరస్కరిస్తున్నారు. జనగణన గణాంకాలు, రాజ్యాంగ నిబంధనలు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ వ్యవస్థ వంటి అంశాలు ఈ వర్గాల్లో అనేక సమూహాలను హిందూ సమాజ పరిధిలోనే పరిగణి స్తున్నాయని వారు గుర్తుచేస్తున్నారు.

అందువల్ల ఈ వర్గాలను హిందూ జనాభా లెక్కల నుంచి మినహాయించడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న చర్యగా అభివర్ణిస్తున్నారు. హిందూ మతం అనేక విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాలను కలిగి ఉన్న మతమని, ఈ వైవిధ్యం దాని జనాభాపరమైన ప్రాధాన్యాన్ని తగ్గించదని వారు వాదిస్తున్నారు.

ఈ వివాదం సమకాలీన భారత రాజకీయాల్లోని పలు కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. మొదటగా, విభిన్న గుర్తింపులతో కూడిన ప్రజాస్వామ్యంలో సామాజిక ఐక్యత ఎంత సున్నితంగా ఉంటుందో, గుర్తింపు ఆధారిత నేరెటివ్ ఎంత వేగంగా విభజనకు దారితీ యగలదో ఇది నిరూపిస్తున్నది. రెండవది, ముస్లిం పర్సనల్ లా బోర్డు వంటి మతపరమైన సంస్థల పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన అంశాల్లో తమ వర్గ ప్రయోజనాలను ప్రాతినిధ్యం వహించే ఈ సంస్థలు, మెజారిటీ అల్పసంఖ్యాక వర్గాల నిర్వచనాలను పునర్నిర్వచించే ప్రయత్నం చేసినప్పుడు అది సహజం గానే విమర్శలను ఎదుర్కొంటున్నది. మూడవది, మీడియా, సోషల్ మీడియా ప్రభావాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.  రిపబ్లిక్ టీవీ వంటి సంస్థల దూకుడు ప్రచారం ప్రజల దృష్టిని ఆకర్షించినప్పటికీ, అది ఇప్పటికే ఉన్న అభిప్రాయాలను మరింత బలపరిచే ప్రమా దం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

పాలనా పరంగా చూస్తే, ఇటువంటి వ్యాఖ్య లు సమ్మిళిత అభివృద్ధి, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలను సంక్లిష్టం చేస్తాయి. భారత రాజ్యాంగం వ్యక్తిగత హక్కు లు, సమూహ హక్కులు రెండింటినీ గుర్తిస్తూ లౌకికతత్వాన్ని, సాంస్కృతిక వైవిద్ధ్యాన్ని సమతుల్యంగా కాపాడే ప్రయత్నం చేస్తుంది.

మెజా రిటీ, మైనారిటీ నిర్వచనాలను గణాంకాల ఆధారంగా కొత్తగా నిర్వచించే ప్రయత్నాలు భవిష్యత్తులో రిజర్వేషన్లు, రాజకీయ ప్రాతినిధ్యం, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కొత్త డిమాండ్లకు దారితీయవచ్చని కొందరు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో జనాభా మార్పులు, మత మార్పిడులు, వలసలపై కొనసాగుతున్న చర్చలతో కూడా ఇవి ముడిపడి ఉన్నాయి.

సామాజిక ఉద్యమం అవసరమే

సామాజిక న్యాయం కోసం కుల ఆధారిత రాజకీయాలు, ఉద్యమాలు అవసరమే. కానీ, ఒక మత సదస్సు వేదికపై హిందూ గుర్తింపును విభజించే ప్రయత్నం చేయడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇది వైవిధ్యాన్ని గుర్తించాలనే పిలుపా? లేక దేవాలయ సంస్కరణలు, ఉమ్మడి పౌరస్మృతి, ఎన్నికల వ్యూహాలపై జరుగుతున్న ప్రస్తుత చర్చల నేపథ్యంలో తీసుకున్న రాజకీయ ఎత్తుగడా అనే సందేహాలు వ్యక్తమవు తున్నాయి. ఈ నేపథ్యంలో పలు హిందూ సంస్థలు, రాజకీయ పార్టీలు వైవిధ్యంలో ఐక్యత అనే భావనను నొక్కిచెబుతున్నాయి.

ఈ వివాదం భారతదేశ సామాజిక నిర్మాణంలోని సంక్లిష్టతను మరోసారి గుర్తుచేసింది. జనగణన గణాంకాలు, సామాజిక అధ్యయనాలు కొన్ని వాస్తవాలను చూపించినప్పటికీ, వాటిపై భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. జనాభా వాస్తవాలను తిరస్కరించడం లేదా ఉపగుర్తింపులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కాకుండా, సమాజంలోని చారిత్రక అసమానతలను పరిష్కరిస్తూనే, ఐక్యతను బలోపేతం చేయడమే ప్రస్తుత మార్గమని పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ వివాదం నిర్మా ణాత్మక చర్చకు దారితీస్తుందా? లేక మరింత వివాదాస్పదమవుతుందా? అన్నది రాజకీయ నాయకులు, పౌర సమాజం, మీడియా ఈ అంశాన్ని ఎలా ముందుకుతీసుకెళ్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది. వైవిధ్యంతో కూడిన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను నిలబెట్టుకో వాలంటే ఉమ్మడి పౌరసత్వ భావనను బలహీనపరిచే ఇలాంటి వ్యాఖ్యల పట్ల అప్రమత్తత అవసరమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

హిందూ సమాజాన్ని విభజించేందుకు కొందరు మౌలికవాద ముస్లిం వర్గాలు కుట్రపూరిత ప్రయ త్నాలు చేస్తున్నాయనే ఆరోపణలను గుర్తించి, అలాంటి హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక ప్రణాళికలను ఎదుర్కొనేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పక తప్పదు.

 ఎడిటోరియల్ డెస్క్