2 March, 2026 | 6:56 AM

మా బతుకులు పట్టవా?

02-03-2026 01:38 AM
  1. సినిమా హీరోలు, హీరోయిన్‌లకే అపాయింట్‌మెంట్లు 
  2. జీతాల్లేక, ఏజెన్సీల వేధింపులతో 5లక్షల మంది విలవిల 
  3. సోనియా గాంధీ ఆశయాలకు విరుద్ధంగా పాలన  
  4. రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్షుడు పులి లక్ష్మయ్య

హైదరాబాద్, సిటీబ్యూరో మార్చి 1 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ఐదు లక్షల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు అంధకారంలో మగ్గుతున్నాయని, వా రి సమస్యలు వినే తీరిక కూడా ప్రభుత్వానికి లేకపోవడం సిగ్గుచేటని రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పులి లక్ష్మ య్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

రెండేళ్లుగా తమ సమస్యలను విన్నవించుకునేందుకు అపాయింట్‌మెంట్ కోరుతున్నా, ముఖ్యమంత్రి కనీసం ఒక్క నిమిషం కూడా సమయం కేటాయించకపోవడంపై నిప్పులు చెరిగారు. సిని మా హీరోలకు ఇచ్చే ప్రాధాన్య త, రక్తం ధారపోసి పనిచే స్తు న్న సామాన్య ఉద్యోగులకు ఇ వ్వకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

తెలంగాణ ఇచ్చింది ఇందుకేనా...

నాడు సోనియా గాంధీ నా తెలంగాణ బిడ్డలు ఆగం కావద్దు అనే ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని, కానీ నేడు స్వరాష్ట్రంలో తమ బతుకులు మరింత ఆగం అవుతున్నాయని లక్ష్మయ్య వాపోయారు. రెండు సంవ త్సరాల నుంచి తమ గోడు చెప్పుకుందామ ని తిరుగుతున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. కనీసం తమ గురించి ఆలోచించే తీరిక కూడా ప్రభుత్వ పెద్దలకు లేకపోవడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆయన అభివర్ణించారు. 

తక్షణమే స్పందించాలి..

ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరి చి తమ ప్రతినిధులకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని పులి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఏజెన్సీల వ్యవస్థను ప్రక్షాళన చేసి, నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఐదు లక్షల మంది ఉద్యో గులు, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్చలు జరపాలని, లేనిపక్షంలో తమ ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఏజెన్సీల చేతుల్లో బలైపోతున్నాం

రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు రావడం లేదని పులి లక్ష్మయ్య ఆరోపించారు. మధ్యలో ఉన్న ఏజెన్సీలు ఉద్యోగుల రక్తాన్ని తాగుతున్నాయని, వారి వేధింపులు భరించలేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన చెందారు. ఒకపక్క జీతాలు లేవు.. మరోపక్క ఏజెన్సీల దోపిడీ.. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఎలా బతకాలి.. అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఓట్లు వేసి గెలిపించిన తమను కాదని, కేవలం గ్లామర్ కోసం సినిమా హీరోలకు రెడ్ కార్పె ట్ వేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్య క్తం చేశారు.