గిరిజనులు వారి తండ్రులకే పుట్టారా?
రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి నోటి దురుసు
జైపూర్, జూన్ 23: రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దలివార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గిరిజనులు హిందువులు కాదంటే వారు వారి తల్లిదండ్రులకే పుట్టారో లేదో తెలుసుకొనేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తామని అవమానించారు. రాష్ట్రంలోని భారతీయ ఆదివాసీ పార్టీ (బీఏపీ) నేతలు గిరిజనులు హిందువుల కాదని, వారి ఆచార వ్యవహారాలు వేరేగా ఉంటాయని కొంతకాలంగా వాదిస్తున్నారు. ఈ వాదనను తిప్పికొట్టే క్రమంలో ఆయన హద్దులు మీరి మాట్లాడారు.
ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘ వాళ్లు (గిరిజనులు) హిందువులా కాదా అనేది వారి పూర్వీకులను అడిగి తెలుసుకోవాలి. మేం జెనటికల్ విభాగాన్ని కూడా అడుగుతాం. ఒకవేళ వాళ్లు హిందువులు కాకపోతే.. అప్పుడు వారికి డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించి నిజంగా వాళ్లు వారి తల్లిదండ్రులకే పుట్టారో లేదో తేలుస్తాం’ అని అహంకారపూరితంగా మాట్లాడారు. దలివార్ వ్యాఖ్యలపై రాజస్థాన్‌లో రాజకీయ దుమారం రేగుతున్నది. కాంగ్రెస్, బీఏపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.






