ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ అరెస్ట్
- తనపై లైంగిక దాడి చేశాడని యువకుడి ఫిర్యాదు
ఆరోపణలను ఖండించిన సూరజ్ రేవణ్ణ
బెంగళూరు, జూన్ 23 : మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కుటుంబాన్ని వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆయన మనవడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో అరెస్టవ్వగా.. తాజాగా, ఆయన మరో మనవడు, ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జేడీఎస్ ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణని కర్ణాటక పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సూరజ్ రేవణ్ణ తనపై స్వలింగ లైంగిక దాడికి దిగినట్లు హోళినరసిపురా పోలీస్ స్టేషన్‌లో జేడీఎస్ కార్యకర్త చేతన్(27) అనే యువకుడు ఫిర్యాదు చేశాడు. దీంతో, సూరజ్ రేవణ్ణపై ఐపీసీ సెక్షన్ 377 (అసహజ సెక్స్), 506 (క్రిమినల్ బెదిరింపు) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జూన్ 16న సూరజ్ ఫామ్‌హౌస్‌లో తనపై లైంగికంగా దాడి చేశాడని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సహకరిస్తే తనకు రాజకీయంగా ఎదిగేందుకు సాయం చేస్తానని బలవంతంగా లైంగిక దాడికి దిగాడని ఆరోపించాడు.
రూ.5 కోట్లు ఇవ్వాలని బెదిరించాడు..
ఈ ఆరోపణలను సూరజ్ తోసిపుచ్చాడు. తనను బ్లాక్‌మెయిల్ చేయడానికే చేతన్ అసత్య ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొన్నాడు. చేతన్ రూ. 5 కోట్లు ఇవ్వాలని తనను బెదిరించాడని, తాను ఇవ్వడకపోవడంతోనే ఈ కేసు పెట్టాడని ఆరోపించాడు. మరోవైపు, సూరజ్ అనుచరుడైన శివకుమార్ అనే వ్యక్తి చేతన్‌పై హోళినరిసిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రేవణ్ణను రూ. 5 కోట్లు ఇవ్వాలని చేతన్ డిమాండ్ చేశాడని, ఇవ్వకపోతే లైంగిక దాడి చేసినట్లు కేసు పెడతానని బెదిరించినట్లు అందులో పేర్కొన్నాడు.






