కష్టకాలంలో ఆదుకున్నారు
వయనాడ్ ప్రజలకు రాహుల్ భావోద్వేగ లేఖ
న్యూఢిల్లీ, జూన్ 23: కేరళలోని వయనాడ్ ఓటర్లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భావోద్వేగ లేఖ రాశారు. తనను కష్టకాలంలో ఆదుకొన్నారని గుర్తుచేసుకొన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌తోపాటు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకర్గం నుంచి కూడా రాహుల్‌గాంధీ గెలిచిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఎన్నికల ఫలితాలు వచ్చిన 14 రోజుల్లో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ వయనాడ్‌ను వదులుకొన్నారు. 2019, 2024 ఎన్నికల్లో ఆయన వరుసగా ఇక్కడి నుంచి భారీ మెజారిటీతో గెలిచారు.
యూపీలోని అమేథీలో ఓడిపోయిన తర్వాత ఆయనను ఆదుకొన్నది యవనాడ్ ఓటర్లే. అందుకే ఆ నియోజకవర్గంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొంటూ ఆదివారం ఓ లేఖ రాశారు. ‘మీరు నాపై అంతులేని ప్రేమ, ఆప్యాయతలు చూపించారు. మీరు ఏ పార్టీకి చెందినవారైనా కానీ, ఏ కులానికి చెందినవారైనా కానీ, ఏ మతానికి చెందినవారైనా కానీ, ఏ భాష మాట్లాడేవారైనా కానీ.. నాపై మీరు చూపిన ప్రేమ వెలకట్టలేనిది. నేను నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్న సమయంలో మీ ప్రేమే నన్ను కాపాడింది.
మీరే నా ఆశ్రయం, నా నివాసం, నా కుటుంబం. మీరు నాపై ఒక్క క్షణమైనా సందేహపడ్డారని నేననుకోను. నేను వయనాడ్‌ను వదులుకొన్నా.. నా స్థానంలో నా సోదరి ప్రియాంకను మీ ప్రతినిధిగా పంపుతున్నాను. మీరు ఆమెకు అవకాశం ఇస్తే మీ ఎంపీగా ఆమె అద్భుతంగా పనిచేస్తారని నమ్మకంగా చెప్పగలను’ అని పేర్కొన్నారు.






