15 May, 2026 | 6:26 PM

టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గా ఆరెపల్లి రాజేందర్

15-05-2026 05:23 PM

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి

మానకొండూరు,(విజయక్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం రాష్ట్ర కో-ఆర్డినేటర్ గా మానకొండూర్ వాసి ఆరెపల్లి రాజేందర్ నియామకమయ్యారు. ఈ మేరకు ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు వీలుగా పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో పార్టీ కమిటీల ఏర్పాటు, దరఖాస్తుల స్వీకరణ, పార్టీ బలోపేతం వంటి తదితర పనుల పర్యవేక్షణ కోసం రాష్ట్ర కో-ఆర్డినేటర్ ను నియమించినట్టు డాక్టర్ కవ్వంపల్లి పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, మానకొండూర్ గ్రామానికి చెందిన ఆరెపల్లి రాజేందర్ భారత ప్రభుత్వరంగ సంస్థ రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీపీసీ)లో పని చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. ఎన్టీపీసీలో  డెప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి కలిగిన హోదాలో పని చేసి రిటైర్డ్ మెంట్ కు నాలుగేళ్ల ముందుగానే 2018 లో స్వచ్చంధ పదవీ విరమణ చేశారు. రాజేందర్ విద్యావేత్త. దళిత ఉద్యమం, తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు.

రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ దళితుల ఐక్యత, సామాజిక న్యాయం కోసం రాజేందర్ పాటుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియామకంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఎస్సీ సెల్ చైర్మన్  డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు ఆరెపల్లి రాజేందర్ కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పాటుపడతానని, తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయబోనని రాజేందర్ స్పష్టం చేశారు.