30 August, 2026 | 2:56 PM

మంత్రి పొంగులేటి పర్యటనకు ఏర్పాట్లు ముమ్మరం

30-08-2026 01:54 PM

కేసముద్రం (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో నిర్వహించే వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సోమవారం వస్తున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనకు ముమ్మరంగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. అధికారులతో సహా కాంగ్రెస్ నేతలు సోమవారం మంత్రి పర్యటన విజయవంతం చేయడానికి అవసరమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కేసముద్రం మండల పరిషత్ ఆవరణలో నిర్వహించే మంత్రి సభకు చురుకుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. సభా వేదిక తో పాటు సభాస్థలి ఏర్పాట్లను శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తదితరులు హాజరు కానున్నారు. 

అభివృద్ధి కార్యక్రమాల వివరాలు ఇవే

కేసముద్రం మండల పరిషత్ ఆవరణలో నిర్వహించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముందుగా కేసముద్రం (వి) లో కోటి 90 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభిస్తారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నూతనంగా 4.6 కోట్లతో నిర్మించనున్న కేసముద్రం మున్సిపాలిటీ ఆఫీస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే  కార్యాలయాన్ని నూతనంగా జిల్లాలో ఇటీవల ఏర్పడ్డ ఇనుగుర్తి, సిరోల్, దంతాలపల్లి మండల కేంద్రాల్లో 2.25 కోట్ల చొప్పున ఒక్కో తహసిల్దార్ కార్యాలయాలను నిర్మించనున్నారు. వాటి నిర్మాణానికి కూడా ఇక్కడి నుండే వర్చువల్ గా మంత్రి శంకుస్థాపన చేస్తారు. అనంతరం 8 ఏళ్ల కాలంగా భూమి హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న నారాయణపురం గ్రామానికి చెందిన 780 మంది రైతులకు రీ సర్వే చేయించి ప్రభుత్వం నూతనంగా జారీచేసిన పట్టా పాస్ పుస్తకాలను రైతులకు పంపిణీ చేస్తారు. అనంతరం రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుండి మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు ఇతర అధికారులతో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షిస్తారు.