మృగశిర ఆగమనం
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 7(విజయక్రాంతి): వేసవి ముగిసి వర్షాకాలం ఆరంభ సమయం మొదలైంది. 27 కార్తెల్లో మృగశిరకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ కార్తెలో సూర్యుడు భూమికి దగ్గరగా రావడం వల్ల సముద్రంలో నీరు ఆవిరై కన్పిస్తుంది. మృగశిర కార్తె అన్నదాతలకు ముఖ్యమైంది. వర్షాలకు అనుకూలంగా ఉండటంతో రైతు లు వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. ఈ కార్తెలో సాగు ప్రారంభిస్తే పంటలు చీడపీడల బారిన పడకుండా అధిక దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం.
మృగశిర రోజు చేపల వంట
మృగశిర కార్తె ప్రవేశించిన రోజున చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. అయితే దీనివెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉందంటున్నారు వైద్యనిపుణులు. కాలం మారిన సమయంలో మనిషి శరీరంలోనూ మార్పు లు జరిగి వ్యాధులబారిన పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గుండె జబ్బు, అస్తమా బాధితులు ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటివారు మృగశిర ఆరంభం రోజున చేపలు తినడం ద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతారనే నమ్మకం ప్రజల్లో ఉంది.
చేపల్లో పుష్కలమైన పోషకాలు
సాధారణంగా పప్పు దినుసులు, మాంసాల్లో కంటే చేపల్లో పుష్కలమైన పోషకాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. వీటిలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నిషియం, జింక్ వంటి ఖనిజ పోషకాలు లభిస్తాయి. అలాగే మానవుడికి కావాల్సిన అతి ముఖ్యమైన రుచిని పెంచే లైసిన్, మిథియోనిన్, ఐసోల్యూసిన్ వంటి అమైనో అమ్లాలు చేపల్లోలభిస్తాయి. చేప కొవ్వులు చాలా సులభంగా జీర్ణమై శక్తి పెంచుతాయి. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఎవరైన చేపలు తినవచ్చు. చేపలల్లో పాలీ అంసతృప్త కొవ్వు అమ్లాలు ఉండటం తో గుండె సంబందిత, అస్తమా మధుమేహ వ్యాధిగస్తులకు డాక్టర్ ఎక్కువగా సిఫారసు చేస్తుంటారు. గర్బిణులు, చంటిపిల్లల తల్లు లు చేపలు తింటే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. పిల్లలకు సరిపడా పాల వృద్దితో పాటు వ్యాధి నిరోధక శక్తి నాడీ వ్యవస్థ బాగా అభివృద్ది చెందుతుంది. ఇలా చేపలు తినడం ద్వారా అనేక ప్రయోజనాలు, ఆరోగ్య సమస్యలు తీరుతాయి.
నగరంలో సందడి..
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి): మృగశిర కార్తె సందర్బంగా నగరంలోని ముషీరాబాద్‌తోపాటు బేగంబజార్, కూకట్ పల్లి, నాచారం తదితర చేపల మార్కెట్ సందడిగా మారనున్నాయి. వాస్తవానికి మృగశిర కార్తె శుక్రవారమే అయినా, ప్రజలు శనివారం జరుపుకుంటున్నారు. ముషీరాబాద్ మార్కెట్‌కు సాధారణ రోజుల్లో 30 నుంచి 40 టన్నుల చేపలు దిగుమతి అవుతుండగా శని, ఆదివారాలు 60 నుంచి 70 టన్నులు దిగుమతి అయ్యే అవకాశం ఉన్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. శుక్రవారం బొచ్చ కేజీ రూ.100 నుంచి రూ.120 ఉండగా, కొర్రమీను రూ.450 నుంచి రూ.550 వరకూ పలికింది. మృగశిర రోజు చేపలు తింటే మంచిదనే అభిప్రాయం ఉండటంతో ధరలు పెరగనున్నాయి.
చేపలు అ‘ధర’హో!
జగిత్యాల, జూన్ 7 (విజయ క్రాంతి ): మృగశిర కార్తె కావడంతో నీటిలోనే కాదు.. నింగిలోకి ఎగురుతాం అంటూ శుక్రవారం చేపల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటా యి. మృగశిర కార్తె రోజు చేపలు తినే ఆచారం అనాదిగా వస్తుంది. మృగశిర కార్తెకు చేపలను తింటే ఉబ్బసం (అస్తమా) రోగం నాయమవుతుందనే బలమైన నమ్మకం. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా చేపల మార్కెట్లన్నీ ఉదయం నుండి జనంతో కిటకిట లాడాయి. నిన్నమొన్నటి వరకు చేపలు కిలో రూ.400 నుంచి 500 ఉంటే అమాంతం రూ.700 నుంచి 800కు చేరింది. బొమ్మెలు, బొర్సులు, రవులు, జెల్లలు, గురిజెలు, మొప్పలు, పాపర్లు తదితర చేపలతో కొందరు సరిపెట్టుకోగా పెరిగిన ధరలతో మరికొందరు కొనుగోలు చేయలేకపోయారు. శుక్రవారం ఒక్కరోజులోనే 120నుండి 150 టన్నుల చేపల విక్రయాలు జరిగినట్లు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నాయకులు తెలిపారు. మృగశిర ప్రవేశంతో జిల్లాలో చేపల మార్కెట్ల వద్ద ఎక్కడ చూసినా సందడి కనిపిస్తుంది.
జిల్లా కేంద్రమైన జగిత్యాల మార్కెట్ లో దాదాపు 50 నుండి 75 టన్నులు చేపల అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. కోరుట్ల, మెట్‌పల్లి చేపల మార్కెట్లలో దాదాపుగా 75 నుంచి 80 టన్నుల చేపల విక్రయాలు జరిగినట్టు తెలిసింది. జిల్లాలో ని మండలాలు, గ్రామాల్లో చేపలను పెద్దఎత్తున విక్రయించారు. మరో రెండు రోజులు శని, ఆదివారం కూడా చేపల విక్రయాలు బాగానే జరిగే అవకాశాలు ఉన్నాయని మత్స్య సహకార సంఘం నాయకులు పేర్కొన్నారు. మృగశిర కార్తె కావడంతో సాధారణ రోజుల్లో లభించే వాటికన్నా రెట్టింపు ధరలకు చేపల అమ్మకాలు కొనసాగాయి. మృగశిర కార్తె సందర్భంగా చేపలు విరివిగా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయని ముందస్తుగానే అధిక దిగుబడి చేసుకొని చేపలు ప్రజలకు అందుబాటులో ఉంచారు. పలువురు అస్తమా రోగులతోపాటు ప్రజలు మృగశిర కార్తె రోజున అధిక ధరలు సైతం వెచ్చించి కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. చేపల వ్యాపారులు కూడా రెండింతలు రేట్లు పెంచడం అధిక ధరలతో వినియోగదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. అయితే నీటిలోనే కాదు నింగిలోకి సైతం ఎగరగలమని మృగశిర కార్తె రోజు చేపలు నిరూపించుకున్నాయి.






