ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్‌ఎస్ ప్రచారం
హనుమకొండ, జూన్ 7 (విజయక్రాంతి) : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ.. బీఆర్‌ఎస్ కోసం డబ్బులు పంచి మరీ ప్రచారం చేసిందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విమర్శించారు. శుక్రవారం హనుమకొండలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఎంపీ కడియం కావ్యతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. కావ్య గెలుపు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, వరంగల్ ప్రజలు ఎవరి సర్వేలకు విశ్లేషణలకు అందకుండా తీర్పు ఇచ్చారని అన్నారు. అసెంబ్లీ కన్నా పార్లమెంట్ ఎన్నికల్లోనే కాంగ్రెస్‌కు ఓటు శాతం పెరిగిందని చెప్పారు.
బీఆర్‌ఎస్ ఓటింగ్ బీజేపీకి షిఫ్ట్ అయిందని దేశంలో బీజేపీ, మోదీ చరిష్మా తగ్గిందని అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని, ప్రధానిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపడతారని జోస్యం చెప్పారు. రాజ్యాంగాన్ని ముట్టుకునే ప్రయత్నం చేసినా మైనార్టీ, పేదల జోలికి వచ్చినా కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని ఆమె హెచ్చరించారు. రాజముద్రలో కీర్తి తోరణం తొలగించలేదని, ఇంకా పరిశీలనలో ఉన్నట్టు మంత్రి స్పష్టంచేశారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు.
శ్రీహరికి మచ్చ రాకుండా ముందుకెళ్తా : ఎంపీ కడియం కావ్య
తన తండ్రి కడియం శ్రీహరికి మచ్చ రాకుండా రాజకీయాల్లో ముందుకు వెళ్తానని ఎంపీ కడియం కావ్య స్పష్టంచేశారు. కులం, మతం పేరుతో ప్రతిపక్ష నేతలు తనను దూషించడంతోపాటు దాడి చేసినా వెనక్కి తగ్గలేదని గుర్తుచేశారు. కేంద్రంలో బీజేపీ సీట్లు తగ్గడంతోపాటు కాంగ్రెస్‌కు అనూహ్యంగా సీట్లు పెరిగాయని అన్నారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ భారతదేశానికి అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం శ్రీరామ రక్ష అన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తదితరులు పాల్గొన్నారు.






