ఎట్టకేలకు అరుణ గోదాం సీజ్
నిర్మాణం పూర్తయ్యాక చర్య
రాజు బొల్లారంలో అక్రమ షెడ్డుపై చర్యలేవి?
మేడ్చల్, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లంపేట శివారులో అనుమతి లేకుండా నిర్మించిన అరుణ గోదామును ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. నిర్మాణ సమయంలో గతంలో ఇక్కడ పనిచేసిన మున్సిపల్ కమిషనర్లు దీనిని అడ్డుకోలేదు.
పనులు పూర్తయిన తర్వాత సీజ్ చేయడం గమనార్హం. అరుణ గోదాం ఏడాదికాలంగా సాగింది. ఆ సమయంలో అనేక ఫిర్యాదులు అందాయి. ఇద్దరూ మున్సిపల్ కమిషనర్లు మారారు. వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ నిర్మాణదారుడుకి అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అండదండలు ఉన్నట్లు తెలిసింది. ఉత్తర తెలంగాణ లోని ఒక జిల్లాకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఆ ఎమ్మెల్యే అధికారులపై ఒత్తిడి చేసినట్లు తెలిసింది. అక్రమ నిర్మాణదారుడు పలుమార్లు ఆ ఎమ్మెల్యే పేరు వాడుకున్నాడు.
అంతేగాక ఈ అక్రమ నిర్మాణ పనులు సాగడానికి పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారిందని ఆరోపణలు ఉన్నాయి. అరుణ గోదాం నిర్మాణానికి నిబంధనల ప్రకారం అనుమతి రాదు. ప్రధాన రహదారి నుంచి అరుణ గోదాం వరకు రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల అనుమతి వచ్చే అవకాశం లేదు. దీంతో అక్రమ నిర్మాణానికి తెర లేపారు. అనుమతి లేకుండా నిర్మించి ఆ తర్వాత మున్సిపల్ ఇంటి నెంబర్ తీసుకోవాలని భావించారు. అధికారుల సహకారంతో పనులు పూర్తి చేశారు. ఈ అక్రమ నిర్మాణం అధికారులకు, అనధికారులకు కల్పతరువుగా మారింది.
ఉత్తుత్తి సీజేనా?
అరుణ గోదాం సీజ్ చేయడం ఉత్తుత్తిదేనా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిర్మాణదారుడు అధికారులను, అనధికారులను కలిస్తే సీజ్ తొలగిస్తారని అంటున్నారు. రాజు బొల్లారంలో వార్డు కార్యాలయం పక్కన అనుమతి లేకుండా భారీ గోదాం నిర్మాణం జరుగుతోంది. అనేక ఫిర్యాదుల మేరకు మున్సిపల్ అధికారులు నిర్మాణ సామాగ్రి సీజ్ చేశారు. అక్రమ నిర్మాణదారుడు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలిసి వచ్చాడు. ఆ వెంటనే మళ్ళీ పనులు మొదలు పెట్టాడు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరించి మున్సిపల్ ఆదాయం పెంచాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.






