4 August, 2026 | 1:53 AM

పంట మార్పిడిపై ఉద్యానవన శాఖ ప్రత్యేక దృష్టి

04-08-2026 12:00 AM
  1. ఆరుతడి పంటల కు ప్రభుత్వ ప్రోత్సాహం 
  2. డ్రాగన్ ఫ్రూట్ సాగు 1 లక్షా 62 వేల సబ్సిడీ
  3. సద్వినియోగం చేసుకోవాలంటున్న ఉద్యానవన శాఖ అధికారులు 

ములుగు, ఆగస్టు 3 (విజయ క్రాంతి) : ప్రస్తుత తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో అన్నదాతలు ఆందోళన చెందకుండా పంట మార్పిడి పై దృష్టి పెట్టాలని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్న నేపథ్యంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు సైతం రైతులను చైతన్యపరిచేందుకు విస్తృతంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుత ఎల్ డినో ప్రభావం రైతులపై పడకుండా తక్కువ నీటిని ఉపయోగిస్తూ ఎక్కువ లాభాలతో సేద్యం చేసుకునే పంటలను ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ అధికారులు జిల్లాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ప్రత్యామ్నాయ పంటలు అధిక లాభాలతో పాటు ప్రభుత్వ సబ్సిడీ కూడా అందిస్తుందని ఉద్యానవన శాఖ అధికారి శ్రీకాంత్ ఈ సందర్భంగా తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కో హెక్టారు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ప్రభుత్వం 1,62,000 సబ్సిడీ అందజేస్తుంది. అదేవిధంగా అరటి సాగు కోసం ప్రభుత్వం 42 వేల రూపాయలు సబ్సిడీ అందజేస్తుండగా జామ, మామిడి 48 వేల రూపాయలు, బొప్పాయి 18000, నిమ్మ 48 వేలు, కూరగాయలు 24 వేల రూపాయలు, పూల తోటలకు 20వేల రూపాయలు అందజేస్తున్నారు అంతేకాక రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కూరగాయల పందిరికి 50 వేల రూపాయలు అందజేస్తుండగా జిల్లాలో పది యూనిట్లు లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు.

ఏది ఏమైనా వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు ఉద్యానవన శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కృషి చేస్తున్నారు ఇప్పటికే పామాయిల్ సాగులో ములుగు జిల్లా అద్భుతమైన విజయాలను సొంతం చేస్తుండగా ప్రత్యామ్నాయ పంటలను సైతం సాగులోకి తీసుకు రావాలని అధికారులు భావిస్తున్నారు ఎల్లినో ప్రభావం నుండి రైతులకు విముక్తి కలిగించేందుకు తక్కువ నీటితో ఎక్కువ లాభాలు చేకూరి పంటలను సాగు చేసేందుకు ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.