30 June, 2026 | 12:57 PM

ప్రహరీ గోడ నిర్మాణానికి అడ్డంకులు

30-06-2026 12:26 PM

జిల్లా కలెక్టర్‌కు బాధితుడి వినతి

కరీంనగర్ క్రైమ్ జూన్30: చొప్పదండి  రాజీవ్ నగర్ కాలనీకి చెందిన వడ్లూరి లింగయ్య (72) తన స్వంత స్థలంలో ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతుండగా కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తూ దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్నారని  స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించగా  పోలీసు అధికారులు ఇది మా పరిధి కాదు అని పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

గత 41 సంవత్సరాలుగా రాజీవ్ నగర్ కాలనీలోని తన స్వంత ఇంటిలో నివాసం ఉంటున్నానని, కొంతకాలంగా కళ్లేపెల్లి ఆనంద్  కళ్లేపెల్లి శారదా, కళ్లేపెల్లి గోపమ్మ కల్లేపల్లి గోపాల్ మున్సిపల్ ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులుతో భూ వివాదం కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటికే పలుమార్లు దాడులు జరగడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అనంతరం కోర్టును ఆశ్రయించగా తనకు అనుకూలంగా ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు.

కోర్టు ఆదేశాల మేరకు ప్రహరీ గోడ నిర్మాణం చేపడుతున్నప్పటికీ ప్రత్యర్థులు పనులు అడ్డుకోవడం, కూలీలను బెదిరించి పంపించడం, కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం, అసభ్య పదజాలంతో దూషించడం జరుగుతోందని ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు కొనసాగించకుండా అడ్డుపడుతున్నారని, దీంతో తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతోందని వాపోయారు.

ఈ విషయంపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోవడం లేదని, సంబంధిత అధికారులపై కూడా ఫిర్యాదులో ఆరోపణలు చేశారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేసేలా పోలీసు రక్షణ కల్పించి, తన స్వంత స్థలంలో ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.