1 June, 2026 | 12:37 AM

అమ్మమ్మ రుణం తీరెనిట్ల!

01-06-2026 12:00 AM

రచ్చ రవి :

రచ్చ రవి రాసుకొచ్చిన ‘నీ రుణం తీరేదెట్ల?’ రాతను, అండ్లకెంచి అచ్చే కమ్మటి వాసనను ఎట్ల చెప్పుక రావాల్నో తెల్వక ఇగో గిట్ల సురువు జేసిన. దేవుడు అంతటా ఉండలేక అహల్యను పుట్టించాడు.. ఆ అహల్య వెలసిన గర్భగుడిలోని దేవతే శాంతవ్వ. ఆ గర్భగుడికి వీర భక్తుడే ఈ రవన్న అని మనం చెప్పేటట్టు జేసిండు గీ రవన్న. అమ్మమ్మ అంటే దీవెనల కోట. నిజంగా ఆమె అంటే ఎవలకైనా చిన్నసూపే. ఏ పేరుకు నోసుకోదు కూడా. కడుపుల నలుసు వడ్డది మొదలు ఎవల పసితనమైనా ఆమె చేతులల్లనే నడుస్తది.

అసోంటి అమ్మమ్మను మొట్టమొదట ఎత్తుకున్న నేటి మనిషి ఈ రవన్న. తన అమ్మమ్మను డాక్టర్, లాయర్, శాస్త్రవేత్త, కల్చరల్ ప్రొఫెసర్, పండితురాలు.. ఇట్లా పోల్సుకుంట మురిసిన రవన్న తీరు తెన్నులను మనం ఎన్ని టేపులేసినా, పరికరాలెన్ని అచ్చినా కొల్వలేం. అల్లరి ఒక నగలాంటిదట.. గప్పటి యాష్ట గిప్పుడు బంగారి యాది అయిందట. గిదీ రవన్న రాతలున్న బరువు. అమ్మమ్మ యాదికొచ్చిందే పాపం.. ఇగ ఆగలేదు. సింగరేనోళ్లు బొగ్గు తవ్వుకచ్చినట్టు తన నెత్తిల, గుండెల పేర్కపోయిన గురుతులన్నీ గీరి గీరి తవ్వుకచ్చిండు.

ముల్లెలకు ముల్లెలు కట్టుకచ్చి మన ముంగట దులిపిండు. అవన్నీ మనం ఏరుకొని సదువుతాంటే అండ్ల మన అమ్మమ్మలు గూడా కండ్ల ముంగటికి రాకపోతే ఒట్టు. అలుగు దుం కిన ప్రేమలను, అప్పటి అనుబంధాలను, తీపి గురుతులను మన ముంగట వడేసిండు. ఒక్కటి గూడా ఇడిసిపెట్టలే. తన యాది నుంచే గాదు.. తనకు బుద్ధి తెల్వనికాంచి ఏమేమైందో అన్నీ అర్సుకొని అర్సుకొని రాసుకచ్చిండు. 

 శాంతవ్వ తన కొంగు సాటుకు దాసుకొచ్చిన ప్రేమలను మనకు జెప్పుకుంటా మురిసివోతుండు. చెడ్డీ దింపి ముద్దువెట్టిన తన అమ్మమ్మ యాదిని తల్సుకుంటా ఇయ్యాళ్లటికీ కిల కిల నవ్వుకుంటుండు. ఈ రచన కోసం రవన్న తంటాలు వల్లే. జస్ట్ మంకుపట్టు వట్టిండంతే. పిప్పర మెంట్లు సప్పరిచ్చినట్టు నిమ్మలంగా, అల్క గ కాయి దం మీద పెన్నువెట్టి గుంజుకచ్చిండు. శాంతవ్వ సాలు వట్టుకొ ని సాగిపోయిండు. అమ్మమ్మకు అక్షర శిఖరాలే గట్టిండు. పెద్ద పనే జేసిండు.

షార్ట్‌కట్ జిందగీని ఎడమసేత్తో పక్కకు తోసి ఎనభై ఏండ్లు ఎన్కకు తోల్కవోయిండు. బంధాలన్నీ యాదికొచ్చేటట్టు జేసుకచ్చిండు. ఎన్కటి గురుతులను కాపాడే ఒక వీర జవాన్ అయ్యిండు. ఈ జెన్-జెడ్ మెదళ్లకు వట్టిన ఆధునిక చెదలను దులి పేందుకు ఈ రచ్చ రవి సానా ఆరాటవడ్డడు. అన్నలోపట ఇంకెంతో ఉంది. ఇంకేదో మిగిలుంది. ఆ ఆతతేందో మనకు మళ్లా జెప్పుకునేటట్టే కనబడుతుండు. సిన్మాలతో పైకొచ్చి మూలాలను మరిసినోళ్ల గురించి ఆడీడా ఇంటుంటం.

కానీ రవన్న అట్ల గాదు. నటుడిగా ఎంత నవ్విచ్చిండో, ఎంత మెప్పిచ్చిండో రాతగాడిగా ఈ కథను అంత సదివిస్తుండు. అన్నకున్న మూలాల ను ఎతికి ఎతికి మరీ గుంజుకస్తుండు. ఇంకేదో చేయవోతుండు. ఈ పుస్తకమే అందుకు సాచ్చమని నమ్ముతున్నా నేను. ఈ రచ న సదువుతూ రవన్న కన్నతల్లి పేరును ఎతుక్కుంటా ఎన్కకు వోక తప్పలే.

ఎందుకంటే శాంతవ్వ.. శాంతవ్వ.. శాంతవ్వ అని ఒకటే పాట ఎత్తుకుండు గదా. ఈ పుస్తకంలకు సొచ్చినంక గమ్మత్తే అనిపిస్తది. కానీ .. కొనాకు వోయినంక మన గుండెలు బరువైతయ్. కండ్లల్ల నీళ్లు నిండుతయ్.. ఆఖరికి అవే ఆనంద బాస్పాలైత య్. గదే గిండ్లున్న బలం. గిదే రవన్న ఇస్పెషల్. 

సురేంద్ర బండారు

90108 47120