ప్రజా గెరిల్లా కవి సుద్దాల హనుమంతు
శ్రీరామోజు హరగోపాల్ :
పల్లెటూరి పిల్లగాడా !
పసులుగాసే మొనగాడా !!
పాలు మరిచి యెన్నాళ్ళయ్యిందో
ఓ పాలబుగ్గల జీతగాడా
కొలువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో ..?
తెలంగాణలో ఈపాట పాడని పల్లె లేదు. పట్నం లేదు. జనుల నాలుకల మీదికెక్కిన ఈ ఆర్ద్ర మానవతాగీతం రాసింది తెలంగాణా సాయుధపోరాటంలో పెన్నూ, గన్నూ ధరించి పోరాడిన ప్రజా గెరిల్లా కవి సుద్దాల హనుమంతు. సాయుధ పోరాటకాలంలో ప్రజల్ని యోధులుగా మార్చిన పాట లెన్నో ఆయన రాసాడు. అమరణాంతం నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినవాడు. ఆచరణకు అడ్డుపడ్డ అన్నింటినీ తృణప్రాయంగా త్యాగం చేసిన ధన్యజీవి.
కాలం కడుపుతో వుండి కన్న తెలంగాణ సాయుధ విప్లవకవి సుద్దాల హనుమంతు. ఆయన నేటి యాదా ద్రి- భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలోని పాలడుగులో పుట్టాడు.నిజానికి వీరి తాతలవూరు ఇడుకుడ. హనుమంతు తాత పేరు కృష్ణహరి, వెంకటరావమ్మ నాయనమ్మ పేరు. తాతగారు హరికథా కళాకారుడు. హనుమంతు తండ్రి బుచ్చిరాములు. తల్లి లక్ష్మీనర సమ్మ. బుచ్చిరాములు, ఆయన సోదరులైదుగురూ కళాకారులే. 30 సంవత్సరాల పాటలు వీధినాటకాలు ప్రదర్శించినవారు.
పాలడుగు గ్రామానికి వచ్చి స్థిరపడిన బుచ్చిరాములు మంచి పేరున్న ఆయుర్వేద వైద్యుడు. హనుమంతుకు చిన్నప్పుడు బాగా చదువుకోవాలని ఉన్నా బడుల్లో వేసే శిక్షలకు భయపడి సరిగా బడికి వెళ్లేవాడు కాదు. తనకిష్టమైన ఆటలు, పాటలు, ఈత, గుర్రపుస్వారీలలో ఆరితేరాడు. పాలడుగుకు వచ్చిన లక్ష్మీనారాయణ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుని కారణంగా తిరిగి బడిలో చేరి రెండో తరగతి పూర్తిచేశాడు. గొప్ప మానవతావాదియైన ఆ గురువు నుం చి ఎంతో స్ఫూర్తిని పొందానన్నాడు సుద్దాల.
హరికథ చెప్పడానికి పాలడుగు వచ్చిన ఆధ్యాత్మిక గురువు ఆత్మకూరి అంజన్ దాసుగారికి శిష్యుడైపోయి, ఆయన వెంట డ్రామా కంపెనీ సభ్యుడిగా రెండేండ్లు వూళన్నో తిరిగాడు. హనుమంతుగారిది కోకిల గొంతు. పద్నాలుగేండ్ల వయసొచ్చేసరికి గొప్ప గాయకుడు, నటుడయ్యాడు. ఆరోజుల్లో గ్రామాల్లో వెట్టిచాకిరీ విధానం ఉండేది. ఆ పనిచేసేవాళ్లని వెట్టి వాళ్లని పిలిచేవారు. ఒక్కపైసా కూలీ అడగకుండా దొరలు, నిజాం ఉద్యోగులకు అడిగిన పనులన్నీ చెయ్యాలె.
వంతుకొచ్చిన బరువుల ను మోసేవాండ్లను బరువొంతు లోండ్లు అనేవారు. ఒకరోజు పదిరోజుల్నుంచి జ్వరంతో వుండి తిండిలేక వున్న పాపయ్యది బరువాంతుల డ్యూటీ. ఉద్యోగి ఆజ్ఞయింది. బరువులు మొయ్యలేనని కనికరించమని వేడుకున్న పాపయ్యను ఆ ఉద్యోగి తన్ని, ఈడ్చుకపోవ డం చూసి హనుమంతు మనసు కలతపడ్డది. ఆ సన్నివేశం మనసులో వుండిపోయింది. తర్వాతికాలంలో ఆ సంఘటనే ‘వెట్టిచాకిరీ విధానమో రైతన్న, ఎంత చెప్పినా తీరదో కూలన్న’ అనే పాటగా రచించబడ్డది.
ఊరు విడిచి హైదరాబాద్ పట్నం చేరి వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేశాడు సుద్దాల హనుమంతు. ఆకాలంలో బుద్వేలులో వుండేవాడు. నైజాం పాలనను వ్యతిరేకించే ఆర్య సమాజంలో చేరి, కార్యకర్తగా పనిచేశాడు. అప్పుడే ‘యదార్థ భజనమాల’ అనే పాటల పుస్తకం రాశాడు.
ఆర్య సమాజంలో చేరిన సమయంలో ఆయనకు విద్యాలంకార్ వినాయక రావ్, రుద్రదేవ్, మాడపాటి హనుమం తరావు, సురవరం ప్రతాపరెడ్డి వంటి వారితో పరిచయాలుండేవి. ఆర్యసమాజంతో సంబంధాలున్నాయని హనుమంతును వ్యవసాయ శాఖ అధికారి పరుషంగా మందలించడంతో రోషంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. బుద్వేలులోనే వుంటూ బతుకుదెరువుకు దర్జీపని చేపట్టాడు.
రావి నారాయణరెడ్డి ప్రసంగంతో..
1944లో భువనగిరిలో జరిగిన ఆంధ్ర మహాసభలో రావి నారాయణరెడ్డి ఉపన్యా సం విని కమ్యూనిస్టుగా మారాడు. జీవితాం తం కమ్యూనిస్టుగానే వుండిపోయాడు సుద్దా ల. తెలంగాణ సాయుధ ఉద్యమంలో భాగంగానే ఇప్పటి జనగామ జిల్లాలోని సుద్దాలకు చేరుకుని స్థిరపడ్డాడు. అప్పుడు సుద్దాల గ్రామం దొరలపాలన కిందనే నలుగుతూవుండేది. సుద్దాలలో పొరుగు గ్రామాలలో 1946 ప్రాంతంలో తొలిసారిగా ఎర్రజెండాను, జాతీయజెండాను ఎగరేశాడు హనుమంతు.
అప్ప టి నుంచి పార్టీ అప్పగించిన ‘కళారంగం’ బాధ్యుడిగా, ప్రజలను పోరాటానికి సిద్ధంచేసే కర్తవ్యదీక్షతో రచనలు చేశాడు. జానపద కళారూపాలైన బుర్రకథ, గొల్ల సుద్దులు, బుడబు క్కల పాట, పిట్టల దొర పదం, పకీర్ల పదాల ను ప్రక్రియలుగా ఎన్నుకొని పాటలు, పదా లు ఎన్నో రాశాడు. హనుమంతు జీవితం తెలంగాణ సాయుధపోరాటంతో మమేకమైంది. ప్రజలమధ్య పాటై ప్రవహించిన సాం స్కృతిక జీవనది సుద్దాల.
‘బాంచెన్ దొరా నీ కాల్మొక్తా’నన్న బడుగులతో బడితెలు, తుపాకులు పట్టించి పోరుబాటలో నడిపించిన సాహస స్ఫూర్తి, సాంస్కృతిక సేనాని సుద్దాల హనుమంతు. బతుకంతా నమ్మిన కమ్యూనిజానికి, నిజానికి అంకితం చేసినవాడు. కడదా క పోరుబాట వాడలగుండా నడిచిన కామ్రేడ్ ఆయన. పెన్నూ, గన్నూ చేతపట్టి ఉద్యమంలోకి దూకిన సుద్దాల హనుమంతు తన జీవి తంలో నిజాయితీని, పోరాటతత్వాన్ని ఎప్పు డు, ఎక్కడ, ఎన్నడు విడిచి పెట్టలేదు.
తను నమ్మిన విలువల కొరకు బతుకంతా త్యాగా లు చేస్తూనే వున్నాడు. ఏ ఆశలకు, ప్రలోభాలకు లొంగలేదు. ఆఖరికి మృత్యువై వచ్చిన కాన్సరు కూడా. ఆయన స్వప్నం సమ సమా జం. ప్రజాస్వామ్యీకరించబడిన ప్రజాజీవనం. మానవత్వం నిండిన మరోలోకం. ఆ ఆశావహమైన దృక్పథంతోనే ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ‘ప్రజా ప్రభుత్వం సాధిస్తాం.. నిజాములో ప్రతిబజారులో మా ధ్వజం ఎర్రనిది ఎగురేస్తాం.. చేయెత్తి ప్రతిన చేసాము దేశ క్షేమంబు కొరకు పోరాడ్తాం’ అని రాశాడు.
పాటే ప్రజలకు ఉత్ప్రేరకం..
ఒకసారి ఓగ్రామంలో సభలో సుద్దాల హనుమంతు పాట పాడుతుండగా రజాకార్ల దాడి మొదలైంది. భయపడి పారిపోతున్న ప్రజల్ని చూసి అక్కడున్న ఓ ముసలమ్మ ‘ఎందుకు బయపడి చస్తారు. వచ్చినోళ్ళు వందమందిలేరు. మనం వెయ్యిమందిమున్నాం. వెయ్యిర దెబ్బ వెయ్యిహె’ అనడం విన్న సుద్దాల అప్పటికప్పుడే ఆశువుగా అల్లినపాట
‘వేయ్ రా దెబ్బ వేయ్
దెబ్బకు దెబ్బ వేయ్ రా వేయ్
***************************
దయ్యాపు గుండాగొయ్యిలు రజాకారులు
కయ్యానికి మనపైబడి వచ్చిరి
ఇయ్యర మొయ్యర దంచర బడిశతో
కుయ్యో మొర్రన కోయర చురికతో’
..అని ఆవేశంతో పాడుతుంటే ప్రజలు తిరగబడి, రజాకార్లను ఎదిరించి తరిమికొట్టారట. అది సుద్దాల పాట బలం ప్రజలకు సాహసమిచ్చిన ఉద్యమ గళం. అడవుల్లో, గుట్టల్లో తిరుగుతూ, రాత్రింబవళ్లు దళంతో తిరుగు తూ, దొరల, భూస్వాముల ప్రైవేటు సైన్యాలను, రజాకార్లను ఎదుర్కొంటూ గెరిల్లా సైని కుడై పోరు సాగించాడు సుద్దాల హనుమం తు. రజాకార్ల నాయకుడు గడ్డం అమీన్, గంటా పాపిరెడ్డిని కాల్చివేసిన సమయంలో వెంట్రుకవాసిలో చావును తప్పించుకున్నాడు.
ముళ్లకంపలు కప్పుకుని కందకంలో దాగి శత్రువుల కంటపడకుండా దాడినుంచి బయటపడ్డాడు. దళంతో తిరుగుతూ గ్రామాల్లో పంచాయితీ కమిటీలను ఏర్పర్చడం, ప్రజల భూముల్ని తాకట్టుపెట్టుకున్న దొరల దస్తావేజులను తగులబెట్టడం, పేదలకు ధాన్యం పం చడం. స్వాధీనం చేసుకున్న భూముల పంపకాల్లో పాల్గొన్నాడు సుద్దాల. 1947లో ఏదో పురుగు ముట్టడం వల్ల తీవ్ర అనారోగ్యం పాలైన హనుమంతుని అజ్ఞాతవాసానికి వెళ్లమని పార్టీ ఆదేశించింది.
మారువేషాలతో బొంబాయికి చేరుకున్న సుద్దాల హనుమం తు, జానకమ్మ దంపతుల్ని వరంగల్ రివర్స్ ఫొటో స్టూడియో అధినేత బిట్ల నారాయణ ఆదరించి, ఆశ్రయమిచ్చాడు. హనుమంతు అజ్ఞాతంలో వున్నా ఆయన పాటలు ప్రజలకు కంఠో పాఠమైనాయి. పోరాట గీతాలైనాయి. ప్రజలను పోరాటయోధులుగా మారడానికి స్ఫూర్తినిస్తూనే వున్నాయి. నిజాం పాలన అంతమైనాక తిరిగి సుద్దాలకు చేరాడు హనుమంతు. గ్రామపార్టీ కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టాడు. ఇంటి బాధ్యతల కొరకు ఆర్‌ఎంపీ వైద్యుడిగా ప్రాక్టీస్ ప్రారంభించాడు.
‘పాలబుగ్గలా జీతగాడ’ పాట వెనుక..
తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన యోధులను‘జోహార్లు జోహార్లు జోహార్లు అమరులార మీకు జోహార్లు’ అన్నపాట తెలంగాణ సాయుధపోరాటం అనే గొల్లసుద్దులు రాశాడు సుద్దాల. అమరులు ప్రాణాలను ధారవోసి సాధించిన తెలంగాణ పోరాట ఫలాలను దందుకున్నది మళ్లీ దొరలు, భూస్వామ్య మూలాలు తుదముట్టలేదు. స్వప్నించిన ప్రజారాజ్యం రానేలేదు. ఉద్యమవీరునిగా గెలిచాడు. ప్రజగా ఓడిపోయాడు సుద్దాల హనుమంతు.
హనుమంతు ఒకరోజు సుద్దాల పొరుగు గ్రామం తేరాలకు వెళ్లి వస్తూ తోవలో పసులను అదమాయించలేక, కాళ్లకు గుచ్చుకున్న ముండ్లను తీసుకోలేక రాతిగుండుమీద కూర్చుని ఏడుస్తున్న పసుల కాపరి పిల్లగాడు బత్తుల అబ్బయ్య కాలిముండ్లు తీసి, ఓదార్చాడు. వాని బదులు తనే పసులను అదమాయించాడు. వాని రూపమే కండ్లల్లో మెదులుతుంటే సుద్దాల గుండెలో పాట గూ డు కట్టుకుంది.
ఇంటికి వస్తూ దారిలో అల్లుకున్న పాటే ‘పల్లెటూరి పిల్లగాడా పసులుగాసే మొనగాడా.. పాలుమరిచి ఎన్నాళ్లయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడా.. కొలువు కుదిరి ఎన్నాళ్లయిందో’ ఈ పాటను ‘మాభూమి’ సినిమా టైటిల్ సాంగ్‌గా తీసుకున్నారు బి.నరసింగరావు. కానీ, అప్పటికి కవి ఎవరో తెలియదు. ప్రజాకవుల సంప్రదాయమది. రాసిన పాటల ను తమ పాటలుగా ఎప్పుడూ చెప్పుకోరు. కాని, వాళ్లని గౌరవించడం సామాజికుల బాధ్యత.
సుద్దాల హనుమంతు వ్యక్తిత్వంగా కరుణాకారుడు. కళ్ళముందు ఎవరన్నా కష్టాల్లో వుంటే తట్టుకునేవాడు కాదు. ఏదో ఒక సాయం చెయ్యందే మనసున పట్టేదికాదు. మంచిమాట విన్నా, మంచిపాట విన్నా ఆయన కళ్లు జలజలా వర్షించేవి. కూతురు భారతి ‘పల్లెటూరి పిల్లగాడా’ పాటను పాడుతుంటే తాను హార్మోనియం వాయిస్తూనే వల వలా ఏడ్చేవాడు. ఇంత మార్దవం, కోమలమై న మనసున్న మనిషి అంత కర్కశమైన సాయుధ పోరాటంలో ఎట్లా పాల్గొన్నాడు.
తుపాకీ బట్టి యుద్ధమెట్లా చేశాడు? ఇంత మెత్తటి మనసున్నోడివి ఎట్ల తుపాకీ బట్టి పోరు చేసి శత్రువులను మట్టుబెట్టివనని అడిగితే ‘ప్రజల బాధల పట్ల కూడా అంత తీవ్రం గానే స్పందించగలిగాను కాబట్టే ఎంత కర్కశమైన తుపాకీనైనా చేతపట్టి యుద్ధం చేశాను. కలంబట్టి అంతే తీవ్రతతో ప్రజలకొరకు పాట లు రాశాను’ అన్నాడు సుద్దాల హనుమంతు.
ఆయన పాటల్లో ‘రణభేరి మ్రోగింది, సంఘం వచ్చింది, జెనంటావా.. ఇది కాదంటావా, చిం దోర పెద్దోర, వా వారెవా వహ్వారెవా, దొరలు భూస్వాములు, మంటలు మంటలు మంట లు, ఇంకెన్నడు సోషలిజం, వ్యవసాయ కూలీ, శివగోవింద పదం, నందామయా గురుడ పదం’ ప్రసిద్ధమైనవి. సుద్దాల అసంపూర్ణంగా రాసిన ‘వీర తెలంగాణ’ యక్షగానాన్ని ఆయన పెద్దకొడుకు సుద్దాల అశోక్ తేజ పూర్తి చేసి పుస్తకంగా అచ్చు వేయించాడు. తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ ప్రజోద్యమాల లోనే మకుటాయమానమైంది.
ఆ ఉద్యమం లో అసమాన వీరగాయక పరంపరలో తలనెత్తుకోతగిన మనిషి సుద్దాల హనుమంతు. ఆయన జీవితం తెలంగాణ సాయుధపోరా టం వేరు వేరు కావు ఒక్కటే. ఆయన పాటల న్నీ ఉద్యమ ప్రేరణనిచ్చే అగ్ని గీతాలే. మానవత్వం పరిమళించే సౌమ్య గీతాలూ వున్నా యి. బతుకే పాటైనవాడు. పాటను పోరుబాటగా వేసినవాడు బతుకంతా సమసమాజ స్వప్నాన్ని శ్వాసించిన సుద్దాల హనుమంతు తెలంగాణకే కాదు సమస్త ఉద్యమ ప్రపంచానికి వైతాళికుడే.
(తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ ‘తెలంగాణ తేజోమూర్తులు’ జీవన చిత్రాల నుంచి సేకరించిన వ్యాసం)






