మార్మిక స్పర్శ ‘రాత్రి సింఫని’
బి.శ్రీనివాసరావు కవి:
జీవితం నేర్పిన పాఠం, సొంతూ రు ఇచ్చిన అనుభవం, అమ్మ నాన్న కళ్లలో కురిసిన ఆవేదన శ్లోకాలు అంతా కలెగలిసి కవిత్వమై కన్నులు తెరుచుకుంది. దాటేసిన కాలం ఇటు దేహాన్ని అటు పరిసరాలను ప్రభావితం చేసింది. పట్టుకారుతో పట్టుకున్న వస్తువు కవితా స్పర్శగా కదిలి ప్రకృతి గవాక్షరంగా పురుడు పోసుకున్నది బాణాల శ్రీనివాసరావు కలం. సహజత్వం నుంచి సంరంభమై స్వాప్నిక జగత్తుకు అక్షర నక్షత్రాలను చెక్కిన నగిషీ కళాకారుని కన్యపదమే ఈ ‘రాత్రి సింఫని’.చల్లని మేఘాల నుంచి వెచ్చని పొద్దును బయటికి లాగి, భావాలతో బాణీని కూర్చి బతుకు పుస్తకం గా రూపం చెక్కారు బాణాల గారు. కవిత్వం ఆయన ఊపిరి.
భావావేశం ఆయన అభివ్యక్తి. సూక్తి ఆయన కవిత్వసాంచ. ఇన్ని లక్షణాలతో రేపటి దర్శనానికి వెలుగు సూత్రాన్ని ‘రాత్రి సింఫని’గా తగిలించాడు. మట్టి మనిషిని మర మనిషిని చేసిన నేటి యుగంపై ప్రశ్నావళి దండను ఎత్తుకున్నాడు కవి. ఈ నిశ్శబ్ద విస్ఫోటనాన్ని విస్తృత పరిచేందుకు కవి చేసిన నేర్పు రసాస్వాదనను చూపడమే కాకుండా ఆలోచనను మండిస్తది.
‘నిశ్శబ్దాన్ని కౌగిలించుకోవడమంటే /శూన్యాన్ని పిడికిట్లో / బిగించినంత మహాకార్యం’ అంటూ నిబద్ధత వాక్యాన్ని రూపు కట్టి రెప్పవాల్సిన ప్రతిజ్ఞకు జెండాకర్రగా నిలిచాడు బాణాల గారు. వెన్నెల శిల్పం శీర్షికలో తన ప్రకృతి వాదాన్ని బలంగా వినిపిస్తాడు. అందరూ నిద్రించే వేళ, రాత్రిని జోకొడుతూ ఎన్నడూ వినని పదాలకు, ప్రాణం పోస్తూ, నిఘంటువుల అర్థాన్ని నిర్భయంగా ఎత్తిచూపుతాడు. ఈ సింఫని స్పర్శ దిద్దిన స్పురణ ఏమిటి? అనే ప్రశ్నకు జవాబుగా నిద్రాణమైన వ్యవస్థపై తన కలం పోటు ముద్రను దించుటకు తను నిద్రపోని సంఘర్షణను ఘాటుగా చిందిస్తాడు.
అంతర్లీన మాధుర్య సౌరభం
కవితల్లోని అంతర్లీనతను ఎక్స్ రే అబ్జర్వేషన్ చేస్తే కవి హృదయంలో జారిన పాదరస అలలు, ప్రకృతి విలాపంలా, జీవం పోసుకున్న కళాత్మక నైపుణ్యం అంతా తెర కట్టి చూపుతాడు. ఎండిపోయిన చెరువు అలుగు పోసినట్లు, వాడి పోయిన చెట్లు చిగురును తొడిగినట్లు లేలేత వాసనల వాదాలకు వారధిగా నిలుస్తాడు. యుగాల నుంచి ఆకాశ సముద్రంలో/ ఒంటరి నావికుడే చందమామ/ అక్కడో పచ్చి బాలింత అలసిపోయి పడుకుంది/ పాల కోసం పసిపాప గుక్క పెట్టి ఏడుస్తున్నట్టు’ అంటూ ‘రాత్రి సింఫని’ కవిత మధుర్యాన్ని పిలుచుటకు మౌన గీతం పలుకుతూనే, జీవన పొరలను మీటేందుకు ప్రతిబంధకాలైన వాటిని పట్టి లాగుతాడు కవి.
ఈ క్రమంలో కవే నిశ్శబ్ద పరిమళాన్ని వెదజల్లుతూ అచేతనంలో ఉన్న ప్రపంచాన్ని చేతనంలోకి గుంజుకొస్తాడు. పరోక్ష వేదాన్ని ప్రకృతి వేదికను చేసుకొని శబ్దమై వ్యాపిస్తాడు. ఒంటరి నావికునిగా అలిసిపోని సంద్రాన్ని ఈదుటకు అందరినీ పిలుస్తూ ప్రతిజ్ఞ కాలంను మేల్కొల్పుతాడు కవి.
ఈ కవిత్వ పుటల పటం వర్తమాన మెట్లపై కదలాడే దృశ్య ప్రతీకలు. ‘అరచేతిలోని గ్లోబు’ అనే కవిత దీనికి చక్కని ఉదాహరణగా తీసుకుంటే ఆత్మలు లేని ఆయుధాలు, అనుబంధాలు లేని మర ఫిరంగులు, దిక్కులుండని, దృక్కులుండని, సమయ సందర్భాలసలే లేని వెంటాడి వేటాడే మానవాయుధాలు అనీ జీవితానికి పర్యాయపదంగా మారిన గాయాన్ని ఎదుర్కొన్నప్పుడే ఔషధ ఆయుధంగా మనిషి తయారవుతాడని మంచి మెటాఫర్ కల్చర్‌తో అదిమి చూపుతాడు.
గెలుపోటముల సంఘర్షణలో మనిషి నిలబడాలంటే సమస్యలతో కలబడాలని ఈ కావ్యం నిండా స్ఫురణ వాక్యమై కనిపిస్తారు శ్రీనివాస్. కవిత్వ నిర్మాణం ఒక కళ. ఈ కళను మెండుగా అందిపుచ్చుకున్న వారు సింఫని కవి. వస్తు సాదృశ్యాన్ని మెలకువతో మెటాఫర్లతో దిద్దడం బాగా అబ్బిన కళ. నచ్చిన అక్షరాలతో నాట్య పదవిన్యాసాన్ని వినయంగా చూపెడతారు.
‘కులం కంపు ఇంకా, ఇంకా ఈ దేహం నిండుగా ప్రవహిస్తున్నందుకే, మేమింకా కులవృత్తుల గుంజలకు కుట్టి వేయబడిన మూగజీవాలైనాము’ అనీ బహుజనపదంలో అస్తిత్వ నేపథ్యానికి అదెరువుగా బాణాల బాటలు పరిచి చెమట నీళ్లలో భావావేశాన్ని రంగరించడం ఆయన కలానికే సాధ్యమన్నట్లు దిద్దినాడు. ‘కురిస్తే ఖాళీ అవుతాయి మబ్బులు.
ఎంత కురిసినా ఖాళీ కానివే కన్నులు కోపానికి చిహ్నం ఎరుపు, ఆ మాటకొస్తే సూర్యుడు ముక్కోపే!’ వంటి కొన్ని బాణాలు మాటల రూపం దాల్చి తన వాడిని పాఠక హృదయంలో చిరస్థాయిగా నిలుపుతారు. ఈ సంపుటి ప్రతిష్ఠాత్మక ఫీచర సునీతా రావు 2026 కవితా పురస్కారానికి ఎంపికవడం పుస్తక అర్హతను పెంచినట్లుగా భావిస్తూ కవి, రచయిత ప్రొఫెసర్ బాణాల శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
గన్నోజు ప్రసాద్ సమీక్షకుడు






