మంథనిలో వైభవంగా ఆషాఢ బోనాల మహోత్సవం
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించిన డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులు, కాకతీయ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు
భక్తిశ్రద్ధలతో సాగిన శోభాయాత్ర
మంథని,(విజయక్రాంతి): ఆషాఢ మాసం తొలి మంగళవారాన్ని పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను కాకతీయ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి తొలి బోనాలను సమర్పించారు.
ఆకట్టుకున్న శోభాయాత్ర
డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్, మండల కన్వీనర్ సంతోష్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మెడగొని రాజమౌళి గౌడ్ పర్యవేక్షణలో, కాకతీయ హైస్కూల్ కరస్పాండెంట్ ప్రదీప్ రెడ్డి సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ప్రెస్ క్లబ్ కార్యాలయం నుంచి మారగొని సంధ్య శంకర్ గౌడ్ బోనం ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరారు. ముందుగా మంత్రపురి రాజరాజేశ్వర ఆలయంలో పూజలు చేసిన అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి చేరుకున్నారు. డప్పు వాయిద్యాలు, జై ఎల్లమ్మ నినాదాల మధ్య సాగిన శోభాయాత్రలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు, కాకతీయ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆధ్యాత్మిక శోభతో అలరారిన ఆలయం
ఆలయంలో అర్చకులు రామడుగు సాయి శ్రీనివాస్ వేదమంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పసుపు, కుంకుమలతో అలంకరించిన బోనాలను మహిళలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.
సంప్రదాయాల పరిరక్షణ అందరి బాధ్యత
ఈ సందర్భంగా క్లబ్ నాయకులు మాట్లాడుతూ... బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలు అంటువ్యాధుల బారిన పడకుండా ప్రజలను కాపాడాలని అమ్మవారికి కృతజ్ఞతగా బోనాలు సమర్పించడం తరతరాలుగా వస్తున్న ఆచారమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సంప్రదాయాలపై అవగాహన పెంపొందిస్తాయన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన పాఠశాల, కళాశాల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలిపారు.






