21 July, 2026 | 8:39 PM

ఎన్‌టీఏ వైఫల్యాలు, ఢిల్లీ దమనకాండపై ఏఐఎస్ఎఫ్ ఆగ్రహం

21-07-2026 05:38 PM

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

ఉప్పల్,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసిన ఎన్‌టీఏ (NTA) వైఫల్యాలు, వరుస పరీక్షల పేపర్ లీకేజీలు, ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జీకి నిరసనగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) ఉప్పల్ మండల సమితి ఆధ్వర్యంలో మల్లాపూర్‌లోని ఎలిఫెంటా చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఉప్పల్ మండల అధ్యక్షుడు అజీమ్ పాషా, కార్యదర్శి మహేష్ కుమార్ మాట్లాడుతూ, దేశభక్తి పేరుతో విద్యార్థులను మోసం చేయడం కాదని, యువతకు నాణ్యమైన విద్య, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ, మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే నిజమైన దేశభక్తి అని పేర్కొన్నారు. 2014 నుంచి దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి పరీక్షల్లో వరుసగా పేపర్ లీకేజీలు, పరీక్షా అవకతవకలు చోటుచేసుకోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.

ఎన్‌టీఏపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో విశ్వాసం దెబ్బతిన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించకుండా విద్యార్థులపైనే పోలీసు బలగాలను ప్రయోగించడం బాధాకరమని అన్నారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులను లాఠీలతో కొట్టడం, బలవంతంగా నిర్బంధించడం, ఇనుప బ్యారికేడ్లతో అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పరిణామాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.