చిట్యాలలో కోతులు, వీధికుక్కల సమస్యపై బీఆర్ఎస్ ధర్నా
సమస్య పరిష్కారంతో పాటు బాధితులకు నష్టపరిహారం అందించాలని వినతి
చిట్యాల,(విజయ క్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో కోతులు, వీధికుక్కల సమస్య పరిష్కారం కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ అధికారులకు సమర్పించారు. ధర్నాలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన వీధుల్లో కోతులు, వీధికుక్కల సంచారం పెరగడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ముఖ్యంగా చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతపై ప్రజల్లో ఆందోళన నెలకొన్నదని పేర్కొన్నారు. కోతులు, వీధికుక్కల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
అలాగే దాడులకు గురై గాయపడిన బాధితులకు ప్రభుత్వం ఉచిత వైద్య చికిత్సతో పాటు తగిన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ధర్నా అనంతరం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేసి, సమస్యను ప్రాధాన్యతతో పరిగణించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, బీఆర్ఎస్ నాయకులు జమాండ్ల శ్రీనివాస్ రెడ్డి, జిట్ట బొందయ్య, బొబ్బల శివశంకర్ రెడ్డి, నిమ్మనగోటి శ్రీనివాస్, ఎస్‌కే షబానా అజీముద్దీన్, ఆగు అశోక్ యాదవ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






