రేప్ గురించి ఆమెని అడగండి
- కంగనాపై అకాలీ మాజీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
- సిమ్రన్‌జిత్ వ్యాఖ్యలపై పంజాబ్ మహిళా కమిషన్ ఆగ్రహం.
చండీగఢ్, ఆగస్టు 29: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతుల నిరసనలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడటంతో పాటు సొంత పార్టీనే వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో తాజాగా శిరోమణి అకాలీదళ్ నేత, మాజీ ఎంపీ సిమ్రన్‌జిత్‌సింగ్ మాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. రైతుల నిరసనల్లో అత్యాచారాలు జరిగాయన్న రనౌత్ వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రేప్ ఎలా జరుగుతుందో మీరు ఆమె (కంగనా రనౌత్)ను అడగవచ్చు. తద్వారా రేప్ ఎలా జరుగుతుందో ప్రజలకు వివరించవచ్చు. ఆమెకు ఇందులో చాలా అనుభవం ఉంది అని సిమ్రన్‌జిత్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.
మహిళా కమిషన్ ఆగ్రహం
కంగనాపై సిమ్రన్‌జిత్ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యాఖ్యలు మహిళలను అవమానించినట్లేనని, ఆయనపై తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సిమ్రన్‌జిత్ ప్రకటనపై కంగనా బృందం స్పందిస్తూ లైంగికదాడులను చిన్నచూపు చూడటం సర్వసాధారణమైందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రోజు ఓ సీనియర్ నేత అత్యాచారాన్ని సైకిల్ తొక్కడంతో పోల్చారు.
మన పితృస్వామ్య దేశంలో మహిళలు అత్యున్నత స్థానంలో ఉన్నా సరదా కోసం మహిళలపై చేసే అత్యాచారాలు, హింసాకాండ చాలా లోతుగా పాతుకుపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు అని పేర్కొంది. కాగా, రైతుల నిరసనలపై కంగనా చేసిన వ్యాఖ్యలను బీజేపీ వ్యతిరేకిస్తూ.. పార్టీ విధానాలపై మాట్లాడే హక్కు, అధికారం ఆమెకు లేదని స్పష్టం చేసింది. అధిష్ఠానం ప్రకటనపై కంగనా కూడా సానుకూలంగా స్పందిస్తూ తన మాటే పార్టీ తుది మాట కాదని, అలా చెప్పుకోవడానికి తాను మూర్ఖురాలిని కాదని పేర్కొన్నారు.




