బళ్లారి జైలుకు దర్శన్
గురువారం ఉదయం తరలించిన అధికారులు
బెంగళూరు, ఆగస్టు 29: అభిమాని హత్య కేసులో నిందితుడిగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కన్నడ నటుడు దర్శన్‌ను బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బళ్లారి జైలుకు గురువారం ఉదయం తరలించారు. పరప్పన జైలులో దర్శన్‌కు రాచమ ర్యాదలు లభిస్తున్నట్లు ఫొటో, వీడియో వైరల్ కావడంలో బెంగళూరు కోర్టు ఆదేశాలను అనుసరించి అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని సైతం ఇతర జైళ్లకు తరలించాలని కోర్టు ఆదేశించింది.
దీంతో పవన్, రాఘవేంద్ర, నందీశ్‌ను మైసూరు జైలుకు, జగదీశ్, లక్ష్మణను శివమొగ్గ జైలుకు, ధన్‌రాజ్‌ను ధార్వాడ్ జైలుకు, వినయ్‌ను విజయపుర జైలుకు, నాగరాజును కలబురిగి జైలుకు, ప్రదోశ్‌ను బెలగావి జైలుకు తరలించనున్నారు. మరో నలుగురు నిందితురు రవి, కార్తీక్, నిఖిల్, కేశవమూర్తిను ముందుగానే తుముకూరు కారాగారానికి పంపారు. మొత్తం 17 మంది నిందితుల్లో పవిత్ర గౌడ, అనుకుమార్, దీపక్ మాత్రం పరప్పన కేంద్ర కారాగారంలోనే ఉండనున్నారు. కాగా, బుధవారం దర్శన్, పవిత్రగౌడతో పాటు మరికొంత మంది జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో సెప్టెంబర్ 9 వరకు పొడిగించారు.




