8 April, 2026 | 2:01 AM

కాంగ్రెస్ సీనియర్ నేత కోసం హైదరాబాద్ వచ్చిన అస్సాం పోలీసులు

08-04-2026 12:22 AM

బంజారాహిల్స్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సతీమణి రినికి భూయాన్ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా చిక్కుల్లో పడ్డారు. రినికి భూయాన్ మూడు దేశాల పాస్పోర్టులు కలిగి ఉన్నారంటూ పవన్ ఖేరా చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన అస్సాం పోలీసులు, ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు.

ఇప్పటికే ఢిల్లీలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన పోలీసులు, పవన్ ఖేరా హైదరాబాద్లో ఉన్నట్లు గుర్తించారు. కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ భర్త అయిన పవన్, ప్రస్తుతం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని తన నివాసంలో ఉన్నట్లు సమాచారం అందడంతో అస్సాం పోలీసు బృందం అక్కడికి చేరుకుంది. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ పోలీసులు పవన్ నివాసం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.