8 April, 2026 | 1:59 AM

జిల్లాలో ప్రత్యేక అగ్నిమాపక భద్రత తనిఖీలు

08-04-2026 12:22 AM

అగ్నిమాపక జిల్లా అధికారి నాగేశ్వరరావు

పటాన్‌చెరు, ఏప్రిల్ 7 : తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని పరిశ్రమలు, నివాస, విద్యా, వాణిజ్య, ఇతర సంస్థలలో అగ్నిమాపక భద్రత ప్రమాణాల అమలుపై ప్రత్యేక తనిఖీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.నాగేశ్వరరావు తెలిపారు.

ఈ ప్రత్యేక డ్రైవ్లో భాగంగా ప్రతి వారం ముందస్తు సమాచారం ఇచ్చి సంబంధిత యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, నేషనల్ బిల్డింగ్ కోడ్ ప్రకారం అగ్నిమాపక పరికరాల ఏర్పాటు, నిర్వహణ, సక్రమ పనితీరు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా మంగళవారం పటాన్చెరు స్టేషన్ అగ్నిమాపక అధికారితో కలిసి పటాన్చెరు, ఐడీఏ పాశమైలారంలోని ఎం/ఎస్ న్యూల్యాండ్ లాబొరేటరీస్ లిమిటెడ్, యూనిట్-2,  ఎం/ఎస్ క్రామ్సన్ రీసెర్చ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు.

తనిఖీల సందర్భంగా సంబంధిత సంస్థల సిబ్బందికి అగ్నిప్రమాదాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, భద్రతా ప్రమాణాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చారని తెలిపారు.  అగ్నిమాపక భద్రత ప్రమాణాలు పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాత అవసరమైన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం ఫైర్ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. పారిశ్రామిక సంస్థల యాజమాన్యాలకు అగ్నిమాపక భద్రత పట్ల అవగాహన పెంచడం, ప్రాణాలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలను రక్షించడం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు.