14 July, 2026 | 10:19 PM

సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం

05-12-2024 03:11 AM

తృటిలో తప్పించుకున్న పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం

స్వర్ణదేవాలయం వద్ద కాల్పులకు తెగబడ్డ ఖలిస్థానీ ఉగ్రవాది

దాడిలో పాక్ కుట్ర కోణం?

అమృత్‌సర్, డిసెంబర్ 4:  పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్‌బీర్ సింగ్‌పై బుధవారం హత్యాయత్నం జరిగింది. ప్రఖ్యాత స్వర్ణ దేవాలయం ప్రవేశద్వారం వద్ద సుఖ్‌బీర్ శిక్షలో భాగంగా చక్రాల కుర్చీపై కూర్చొని సేవాదార్(కాపలాదారుడు)గా విధులు నిర్వర్తిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రవేశద్వారం వద్ద ఉన్న సుఖ్‌బీర్‌ను సమీపించిన ఓ వ్యక్తి ప్యాంట్ జేబులోంచి తుపాకీ తీసి ఆయనపై కాల్పులు జరిపాడు.

ఈ క్రమంలో సుఖ్‌బీర్ వ్యక్తిగత సిబ్బంది అప్రమత్తం కావడంతో ఆయనకు ఎటువంటి హానీ జరగలేదు. కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తర్వాత సుఖ్‌బీర్ తన శిక్షను కొనసాగించారు. ఆయన సతీమణి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్‌తో కలిసి స్వర్ణదేవాలయంలో వంట పాత్రలు శుభ్రం చేశారు.

ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. సుఖ్‌బీర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ తక్షణ దర్యాప్తు చేపట్టి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. ఈ క్రమంలో సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని ఖలిస్థానీ ఉగ్రవాది నరైన్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు.  

నరైన్ సింగ్ నేర చరిత్ర

నిషేధిత ఉగ్రసంస్థలైన బబ్బార్ ఖల్సా ఇంటర్నేషనల్(బీకేఐ)వంటి వాటితో నరైన్‌కు సంబంధాలు ఉన్నాయి. పంజాబ్‌లోకి అక్రమ ఆయుధాలు తేవడం, పేలుడు పదార్థాలను సరఫరా చేయడం వంటి నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇతడిపై డజనుకుపైగా కేసులు ఉన్నాయి.

ఏప్రిల్ 4, 1956లో డేరా బాబా నానాక్ సమీపంలోని చౌరా అనే గ్రామంలో నరైన్ జన్మించాడు. అకాల్ ఫెడరేషన్, ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్ వంటి సంస్థలతో నరైన్‌కు సంబంధాలు ఉన్నాయి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్‌ను హత్య చేసినట్టు ఆరోపణలున్న ఉగ్రవాదులతో ఇతడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

2004లో బురైల్ జైల్ నుంచి బియాంత్ సింగ్‌ను హత్య చేసిన హంతకులు తప్పించుకోవడానికి నరైన్ సహాయం చేశాడు. 1984లో పాకిస్థాన్‌కు పారిపోయి పంజాబ్‌లోకి పేలుడు పదార్థాలను రవాణా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా గెరిల్లా యుద్ధం, ఖలిస్థానీ విరుద్ధ్ సాజిష్ వంటి వివాదాస్పద పుస్తకాలను రాశాడు.  నరైన్‌ను మొట్టమొదటగా పోలీసులు 2013, ఫ్రిబవరి 28న అరెస్ట్ చేశారు. 

దాడిలో పాక్ కుట్ర?

మాజీ డిప్యూటీ సీఎంపై జరిగిన దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఆప్ ప్రభు త్వం పంజాబ్‌లో  శాంతి భద్రతలను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని అకాలీదళ్ నేత డిమాండ్ చేశారు. పంజాబ్‌ను మళ్లీ మంటల్లోకి నెట్టడానికి పెద్ద కుట్ర జరిగిందని ఆరోపించారు.

నరేన్ స్వతహాగా ఈ దాడికి పాల్పడినట్టు ప్రస్తుతం భావిస్తున్నామని రాష్ట్ర ఇంటెలిజెన్స్ పేర్కొంది. అయి తే ఇందులో పాక్ కుట్ర కోణాన్ని కొట్టిపారేయలేమని తెలిపింది.  

సిక్కు పెద్ద శిక్ష

అకాలీదళ్‌బీజేపీ ప్రభుత్వ ఉన్న సమయంలో 2007 సుఖ్‌బీర్ రాజకీ యంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతోపాటు మతపరమైన తప్పులు చేసినట్టు పేర్కొంటూ సిక్కుల అత్యున్నత సంస్థ ఆయనకు తాజాగా ‘అకల్ తఖ్త్’ శిక్ష విధించింది. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంతోపాటు ఇతర గురుద్వారాల్లో టాయ్‌లెట్‌లు, వంటగదిని శుభ్రం చేయాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే ఆయన గోల్డెన్ టెంపుల్ వద్ద బుధవారం కాపలాదారుగా విధులు నిర్వరిస్తుండగా హత్యాయత్నం జరిగింది. 

సుఖ్‌బీర్ కుటుంబ నేపథ్యం

గతంలో పంజాబ్ సీఎంగా పని చేసిన ప్రకాశ్ సింగ్ బాదల్ కుమారుడే సుఖ్‌బీర్ సింగ్ బాదల్. 1947లో పంజాబ్ రాజకీయాల్లోకి వచ్చిన ప్రకాశ్ సింగ్ 1970లో అకాలీదళ్ పార్టీ తరఫున సీఎం పదవిని చేపట్టారు. ఆ తర్వాత 1977 నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు.

ఈ సమయంలోనే ప్రకాశ్ సింగ్ పంజాబ్‌పై బలమైన పట్టు సాధించారు. అప్పట్లో ఆయన కుటుంబాన్ని మీడియా.. పంజాబ్ ఫస్ట్ ప్యామిలీగా అభివర్ణించింది. రాష్ట్రంలో తండ్రి బలమైన నేతగా ఉన్న సమయంలో సుఖ్‌బీర్ రాజకీయ ప్రవేశం చేశారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉపముఖ్య మంత్రి, ఎంపీ వంటి హోదాల్లో పని చేశారు.

రాజకీయంగా సుఖ్‌బీర్‌కు ఎటువంటి అడ్డంకులు రాకుం డా ప్రకాశ్ సింగ్ జాగ్రత్త వహించారు. ఈ క్రమంలోనే సుఖ్‌బీర్ 2008లో అకాలీదళ్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నారు. కాగా, ఖలిస్థాన్ ఉగ్రవాది భింద్రన్ వాలాపై సైనిక చర్యలు జరిపేందుకు ప్రకాశ్ సింగ్ మద్దతు పలికారని కొద్ది రోజుల క్రితం పంజాబ్ మాజీ సీఎం అమరీంద్ సింగ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సుఖ్‌బీర్‌పై ఖలిస్థానీ ఉగ్రవాది హత్యాయత్నం చేయడం గమనార్హం.