‘మహా’ సీఎం ఫడ్నవీస్
డిప్యూటీలుగా షిండే, పవార్.. గవర్నర్‌ను కలిసిన కూటమి నేతలు
నేడు సాయంత్రం 5.30కి ప్రమాణస్వీకారం..
ముస్తాబవుతున్న ఆజాద్ మైదానం
హాజరుకానున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు
ముంబై, డిసెంబర్ 4: మహా పంచాయితీ ముగిసింది. అందరూ ఊహించిన విధంగానే బీజేపీ కీలక నేత అజిత్ పవార్‌కు సీఎం పదవి దక్కింది. బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరు ప్రతిపాదించగా.. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కోర్ కమిటీ సమావేశం తర్వాత ముంబైలోని విధాన్ భవన్‌లో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగ్గా.. అందులో కూడా ఎమ్మెల్యేలు దేవేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా ఉన్న విజయ్ రూపానీ, నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. మహాయుతి కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్పష్టమైన మెజారిటీ వచ్చినా కానీ మూడు పార్టీల నేతల్లో ఎవరూ సీఎం అవుతారా? అని ఇన్ని రోజులు చర్చలు జరిగాయి. చివరికి బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్‌నే సీఎం పదవి వరించింది.
ఫలించిన బుజ్జగింపులు..
నవంబర్ 23న జరిగిన ఎన్నికల లెక్కింపులో మహాయుతి కూటమి 230 స్థానాలు దక్కాయి. వెంటనే సీఎం ఎవరు అనేది తేలిపోతుంది అని అనుకున్నా కానీ అలా జరగలేదు. ఇన్ని రోజులు కూటమిలోని శివసేన (షిండే) వర్గ నాయకుడు ఏక్‌నాథ్ షిండే సీఎంగా ఉండగా.. ఈ సారి మాత్రం బీజేపీకి 132 సీట్లు దక్కాయి.
దీంతో రెండు పార్టీలలో ఏ ఒక్క పార్టీ మద్దతు తెలిపినా కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చనే ధీమాలో బీజేపీ ఉండడంతో సీఎం ఎంపిక విషయం ఆలస్యం అయినట్లు తెలుస్తోంది. సీఎంగా ఉన్న ఏక్‌నాథ్ షిండేను డిప్యూటీ సీఎం పదవికి ఒప్పించడంలో బీజేపీ పార్టీ విజయవంతం అయింది.
ముస్తాబైన ఆజాద్ మైదానం
నేడు ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 5.30కి ముహూర్తం ఖరారు చేశారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎన్డీయే కూటమి నేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
ఇది మూడో సారి
దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది మూడోసారి. 2014 వరకు సీఎంగా ఉన్న దేవేంద్ర 2019లో రెండో సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అయినా కానీ అప్పటి రాజకీయ పరిణామాల వల్ల ఆయన కేవలం ఐదు రోజులకే రాజీనామా చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
తర్వాత ఏక్‌నాథ్ షిండేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా కానీ షిండే సీఎంగా ఉండడం వల్ల దేవేంద్రకు సీఎం అయ్యే అవకాశం రాలేదు. కానీ ఈ సారి మాత్రం షిండే ఉన్నా కానీ బీజేపీ అధిష్టానం దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గుచూపింది.
యోధుడు ఫడ్నవీస్
కూటమి చీలిక సమయంలో ఫడ్నవీస్ సీఎం పదవిని కోల్పోయారు. ఆ తర్వాత పరిణామాల్లో సీఎం పీఠంను బీజేపీ నేతృత్వం వహిస్తున్న మహాయుతి కూటమి దక్కించుకున్నా కానీ ఫడ్నవీస్‌ను సీఎం పదవి వరించలేదు. అదీ కాక 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘోరంగా దెబ్బతింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ శకం ముగిసిన అధ్యా యం అని చాలా మంది చర్చించారు.
ఫీనిక్స్ పక్షిలా..
లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో దేవేంద్ర ఫడ్నవీస్ కుంగిపోలేదు. గోడకు కొట్టిన బంతిలా ఎవరూ ఊహించని వేగంతో వెనక్కి తిరిగొచ్చారు. డిప్యూటీగా ఉంటూనే అసెంబ్లీ ఎన్నికల్లో మహాయు తి విజయం కోసం అహర్నిశలు శ్రమించారు. ఎవరూ ఊహించని విధంగా మహాయుతి కూటమినే కాకుండా బీజేపీ కూడా 85 శాతం స్థానాల్లో విజయబావుటా ఎగిరేసేలా చేశారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ.. వారి అంచనాలకు అందకుండా ప్రణాళికలు రచించి విజయం సాధించారు. కూటమి నేతలకు పెద్ద కానుక ఇచ్చారు.
ఏబీవీపీ లీడర్‌గా..
ఫడ్నవీస్ సంఘ్‌తో అనుబంధం ఉన్న కుటుంబంలో జన్మించారు. ఆరెస్సెస్ విద్యార్థి విభాగం అయిన ఏబీవీపీ నాయకుడిగా చేరి అక్కడ బాధ్యతలు నిర్వర్తించారు. ఏబీవీపీలో రాణిస్తూనే న్యాయశాస్త్రంలో డిగ్రీ, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ కూడా పూర్తి చేశారు.
22వ ఏటే కార్పొరేటర్‌గా..
ఫడ్నవీస్ 22 సంవత్సరాల వయసులోనే నాగ్‌పూర్ నగరపాలక సంస్థకు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 27 సంవత్సరాల వయసులో మేయర్ పదవిని చేపట్టారు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఆయనకు రాలేదు. తొలిసారిగా 1999 అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పూర్ నైరుతి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇక అంచెలంచెలుగా ఎదుగుతూ తన 44వ ఏట మహాకు ముఖ్యమంత్రిగా మారారు.
అదే దేవేంద్ర మార్క్...
ఫడ్నవీస్ ఎంతో పరిణితి కలిగిన నేత అని అంతా చెబుతారు. 2019లో చీలిక సమయంలో ఆయన సీఎం పదవిని కోల్పోయారు. కానీ 2022లోనే మహాయుతి ద్వారా బీజేపీ కూటమికి సీఎం పదవి దక్కినా కానీ దేవేంద్ర ఫడ్నవీస్ ఆ సీఎం పదవిని శివసేన (షిండే) నేత ఏక్‌నాథ్ షిండే కోసం త్యాగం చేసి డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్నారు.
ఆ సమయంలో ఏక్‌నాథ్ షిండే మద్దతు చాలా అవసరం కావున ఆయన డిప్యూటీకి ఒప్పుకున్నారు. ఇక్కడే ఆయన ఆలోచనా సరళి అర్థం అవుతోందని చాలా మంది విశ్లేషకులు చెబుతారు.
అభివృద్ధే శ్వాసగా..
ఫడ్నవీస్ అభివృద్ధి మంత్రం కూడా ఎన్నికల్లో బాగా పని చేసింది. అంతే కా కుండా ఆయన వ్యూహాలు, ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు ఆయన వేసిన ఎత్తులు కూడా ఈ ఎన్నికల్లో బాగా పని చేశాయి. మహారాష్ట్రలో చేపట్టిన ప్రతి పెద్ద ప్రాజెక్టులోనూ ఫడ్నవీస్ పాత్ర ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫడ్నవీస్‌లోని ఈ కోణం కూడా బీజేపీ పెద్దలు అతడి వైపు మొగ్గు చూపేలా చేసింది.
18వ సీఎంగా..
నేడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్రకు 18వ ముఖ్యమంత్రి. ఇప్పటి వరకు 17 మంది మహారాష్ట్రను పాలించారు. ఫడ్నవీస్ ఇప్పటి వరకు డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తించారు. అంతే కాకుండా మహా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కూడా సేవలందించారు.
దేవేంద్ర ఫడ్నవీస్ కాదిక
మహారాష్ట్రకు కాబోయే నూతన ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తన పేరును మార్చుకున్నారు. నేడే ప్రమాణ స్వీకారం ఉండడంతో పలువురికి ఇందుకు సంబంధించిన ఆహ్వానాలను కూడా పంపుతున్నారు. ఈ ఆహ్వానాల్లో దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్‌కు బదులుగా దేవేంద్ర సరిత గంగాధర్‌రావు ఫడ్నవీస్ అని ఉంది.
దేవేంద్ర ఫడ్నవీస్ తన తల్లి, తండ్రి పేరు వచ్చేలా ఈ పేరును మార్చుకున్నాడు. దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ బ్యాంకర్. వారికి దివిజ అనే కూతురు ఉంది.
గవర్నర్‌ను కలిసిన ‘మహాయుతి’ నేతలు
దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని మహాయుతి నేతలు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. తమకు మద్దతిచ్చే ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించారు. ఫడ్నవీస్ మాత్రమే కాకుండా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ కూడా గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. మహాయుతి నేతలు గవర్నర్‌ను కలిసిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు.






