10 July, 2026 | 1:52 AM

గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంచాలి

10-07-2026 12:48 AM
  1. ఉద్యోగాలను వెంటనే రెన్యువల్ చేయాలి
  2. సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఆర్ కృష్ణయ్య లేఖ

ముషీరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో 150 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 1,940 మంది గెస్ట్ లెక్చరర్ల జీతాలను నెల కు రూ.28 వేల నుంచి రూ.50 వేలకు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా పనిచేస్తున్నారని,  రెగ్యులర్ లెక్చరర్ల విద్యార్హతలు, పీహెచ్‌డీ విద్యార్థులతో టీచింగ్ సమయం అన్ని రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా ఉన్నాయని తెలిపారు. జీతం మాత్రం తక్కువగా ఉందన్నారు. 10--15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా ఇదే జీతం ఇస్తున్నారన్నారు. వెంటనే జీతాలు పెంచాలని, అలాగే కాలేజీలు ప్రారంభమై ఒక నెల గడుస్తున్నా ఇంతవరకు రెన్యువల్ చేయడం లేదన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం 4,098 మంజురైన అధ్యాపక పోస్టులు ఉండగా, ప్రస్తుతం కేవలం1,276 మంది రెగ్యులర్ అధ్యాపకులు, 1940 గెస్ట్ లెక్చరర్ల మాత్రమే పనిచేస్తున్నారన్నా రు. దీనివల్ల గణనీయమైన సంఖ్యలో అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 3.20 లక్షలకు పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. తక్షణమే ముఖ్యమంత్రి స్పందించి గెస్ట్ లెక్చరర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.