రష్యా భూభాగాన్ని తాకిన గ్రహశకలం
భూ వాతావరణంలోకి రాగానే కాలిపోవడంతో తప్పిన నష్టం
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: అంతరిక్షం నుంచి దూసుకొచ్చిన ఒక చిన్న గ్రహశకలం రష్యా భూభాగాన్ని తాకింది. సుమారు 70 సెంటీమీటర్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన గ్రహశకలం మంగళవారం సాయంత్రం ఈశాన్య రష్యాలోని మారుమూల ప్రాంతం దిశగా దూసుకొచ్చింది. అయితే అది మార్గమధ్యలోనే మండిపోవడంతో ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదు.
భూ వాతావరణంలో అది మండిపోవడంతో కొద్ది సమయం వరకూ ఆకాశంలో మెరుపులు మెరిశాయి. ఈ అరుదైన దృశ్యాలను స్థానికులు ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రస్తుతం ఆ గ్రహశకలానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, గ్రహశకలం భూమివైపు దూసుకొస్తున్నట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ముందుగానే గుర్తించింది. నాసా ఈ గ్రహశకలాన్ని హాని చేయని అగ్ని గోళంగా అభివర్ణించింది.






