భూమివైపు దూసుకొస్తున్న గ్రహశకలం
- భూమిని ఢీకొట్టేందుకు 72 శాతం అవకాశం
- నాసా శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 23 : అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే ఓ గ్రహశకలం మన భూమి వైపుకు దూసుకొస్తోందని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాజాగా ఈ గ్రహశకలం ఉనికిని గుర్తించినట్లు తెలిపారు. అయితే, దీని పరిమాణంపై స్పష్టత లేదని వెల్లడించారు. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టే ముప్పు మాత్రం 72 శాతం ఉందని తెలిపారు. 2038 జూలై 12న భూమిని ఢీకొట్టే ప్రమాదముందని స్పష్టం చేశారు.
ప్రస్తుతానికి ఈ ముప్పును తప్పించేందుకు నాసా దగ్గర ఎలాంటి మార్గం లేదని పేర్కొన్నారు. అంతరిక్షంలోని గ్రహశకలాల వల్ల భూమికి ఏర్పడే ముప్పును తప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల కోసం శాస్త్రవేత్తలు డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డార్ట్) మిషన్‌ను రూపొందించారు. ఈ విధానం ద్వారానే ప్రస్తుత ముప్పును గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. సమీప భవిష్యత్తులో గ్రహశకలాల వల్ల భూమికి ఎలాంటి ముప్పు లేకున్నా.. భవిష్యత్తులో పెను ప్రమాదం ఉందని గుర్తు చేశారు.






