పొరుగుకు అడిగినంత సాయం
- యాక్ట్ ఈస్ట్ పాలసీతో స్నేహ హస్తం
- భారత్- బంగ్లాదేశ్ తీస్తా ప్రాజెక్టు నిర్మాణం
- అధ్యయనానికి బంగ్లాకు టెక్నికల్ టీం
- రెండు దేశాల ప్రధానుల ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ, జూన్ 22: తీస్తా నదిపై భారీ నీటిపారుదల ప్రాజెక్టును నిర్మించాలని భారత్ నిర్ణయించాయి. ఈ ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు బంగ్లాదేశ్‌కు సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపాలని భారత్ నిర్ణయించింది. భారత పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం భారత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన ద్వైపాక్షి చర్చల అనంతరం రెండు దేశాలు వివిధ రంగాల్లో పది ఒప్పందాలు చేసుకొన్నాయి.
రక్షణ, డిజిటల్ డొమైన్, సముద్ర తీర భద్రత, బ్లూ ఎకానమీ, రైల్వేలు, అంతరిక్షం, గ్రీన్ టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్యం తదితర అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. చర్చల అనంతరం విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వత్రా మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ సందేశాన్ని వినిపించారు. రెండు దేశాల ప్రజల మధ్య ప్రత్యక్ష సంబంధాల బలోపేతానికి కృషిచేస్తామని మోదీ తెలిపారు. 1996లో రెండు దేశాల మధ్య కుదిరిన గంగా వాటర్ ఒప్పందాన్ని రెన్యూవల్ చేసేందుకుగాను సాంకేతిక స్థాయి చర్చలు జరుపాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
భారత్‌కు బంగ్లాదేశ్ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి, బంగ్లాదేశ్‌కు తాము అమిత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా బంగ్లాదేశ్‌ను అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా భావిస్తున్నట్టు తెలిపారు. సెక్యూరిటీ అండ్ గ్రౌత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ (సాగర్) పాలసీలో భాగంగా హిందూమహా సముద్ర పరివేష్టిత దేశాలకు భారత్ ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. శుక్రవారం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని.. శనివారం రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు
- *వైద్యం కోసం భారత్‌కు వచ్చే బంగ్లాదేశ్ పౌరులకు భారత ప్రభుత్వం ఈ మెడికల్ వీసాలు జారీ చేస్తుంది.
- * బంగ్లాదేశీయుల సౌకర్యార్థం ఆ దేశంలోని రంగ్‌పూర్‌లో భారత్ అసిస్టెంట్ హై కమిషనర్ కార్యాలయాన్ని ప్రారంభిస్తుంది.
- * బంగ్లాదేశ్ సైనిక బలగాలను ఆధునీకరించటంతోపాటు ఆ దేశ ఆయుధ సంపత్తి ఆధునీకరణకు భారత్ సహాయం చేస్తుంది.
- * ఉగ్రవాదాన్ని, అతివాదాన్ని అణచివేసేందుకు రెండు దేశాలు కలిసి పనిచేస్తాయి.
- * రోహింగ్యాల సమస్యను పరిష్కరించటంతోపాటు మయన్మార్‌లో జాతుల ఘర్షణను ఆపేందుకు బిమ్‌స్టెక్ కూటమి ద్వారా తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానులు చర్చలు జరిపారు.
తీస్తాపై సుదీర్ఘ మంతనాలు
భారత్, బంగ్లాదేశ్‌లో ప్రవహించే తీస్తా నదిపై భారీ ఆనకట్టను నిర్మించి ఆ నది నీటిని రెండు దేశాలు వాడుకోవాలన్న ప్రతిపాదన మూడు దశాబ్దాల నుంచి పేపర్లపైనే నానుతున్నది. హిమాలయాల్లో జన్మించే ఈ నది భారత్‌లోని సిక్కిం, పశ్చిమబెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తున్నది. బంగ్లాదేశ్ భూభాగంలో ఈ నదిపై ఆనకట్ట నిర్మిస్తే రెండు దేశాలకు భారీగా ప్రయోజనం చేకూరుతుంది. 2011లో అప్పటి భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు ప్రాజెక్టు నిర్మాణంపై ఒప్పందం కుదురుతుందని భావించారు. కానీ, చివరి క్షణంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అభ్యంతరం తెలుపటంతో ఒప్పందం కుదరలేదు. ఈ ప్రాజెక్టును బంగ్లాదేశ్‌కు మాత్రమే పరిమితం చేసి స్వయంగా అప్పులిచ్చి నిర్మించేందుకు చైనా ఈ మధ్య అమితాసక్తి చూపుతున్నది. దీంతో భారత్ అలర్ట్ అయ్యింది. ఇరుదేశాల ప్రాజెక్టుగా చేపట్టేందుకు పావులు కదుపుతున్నది.






