15 July, 2026 | 1:54 AM

నేటి నుంచి పార్లమెంటు

24-06-2024 12:47 AM
  1. కొలువుదీరనున్న 18వ లోక్‌సభ

నేడు కొత్త సభ్యుల ప్రమాణం

26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక

27న సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగం

న్యూఢిల్లీ, జూన్ 23: సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 18వ లోక్‌సభ కొలువుదీరనున్నది. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికైన సభ్యులంతా సోమ, మంగళవారాల్లో ప్రమాణం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ కొత్త సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. 26వ తేదీన లోక్‌సభ కొత్త స్పీకర్‌ను ఎన్నుకొంటుంది. 27న పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 

మోదీతో మొదలు

పార్లమెంటు సమావేశాల్లో మొదటిరోజు ప్రొటెం స్పీకర్ మహతాబ్‌తో రాష్ట్రపతి తన నివాసంలో ప్రమాణం చేయిస్తారు. అనంతరం ఆయన ఉదయం 11 గంటలకు లోక్‌సభను సమావేశపరుస్తారు. సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటిస్తారు. ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన సభ్యుల లిస్టును లోక్‌సభ కార్యదర్శి ఉత్పల్ కుమర్‌సింగ్ ప్రొటెం స్పీకర్‌కు అందజేస్తారు. ఆ తర్వాత సభలో కొత్త సభ్యులతో మహతాబ్ ప్రమాణం చేయిస్తారు. మొదట ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంపీగా ప్రమాణం చేస్తారు. అనంతరం ప్రొటెం స్పీకర్‌కు సహాయంగా రాష్ట్రపతి నియమించిన చైర్‌పర్సన్ల ప్యానల్ సభ్యులతో ప్రమాణం చేస్తారు. ప్యానల్ చైర్‌పర్సన్లుగా కొడికున్నిల్ సురేశ్ (కాంగ్రెస్), టీఆర్ బాలు (డీఎంకే), రాధామోహన్‌సింగ్ (బీజేపీ), ఫగ్గన్‌సింగ్ కులస్తే (బీజేపీ), సుదీప్ బందోపాధ్యాయ (టీఎంసీ)ని రాష్ట్రపతి నియమించారు. వీరి ప్రమాణం అనంతరం కేంద్ర మంత్రులతో ఎంపీలుగా మహతాబ్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం ఇతర సభ్యులు ప్రమాణం చేస్తారు. ఇంగ్లిష్ అక్షరాల వరుస క్రమంలో సభ్యులు ప్రమాణం చేస్తారు. సోమ, మంగళవారాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమమే జరుగుతుంది. 

స్పీకర్ ఎన్నిక

లోక్‌సభ స్పీకర్ ఎన్నిక బుధవారం జరుగుతుంది. పదేండ్ల తర్వాత కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటంతో స్పీకర్ పదవికి అధిక ప్రాధాన్యం ఏర్పడింది. స్పీకర్ ఎన్నిక తర్వాత తన మంత్రివర్గాన్ని ప్రధాని మోదీ లోక్‌సభకు పరిచయం చేస్తారు. 27వ తేదీన పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28వ తేదీన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరుగుతుంది. ఈ చర్చకు ప్రధాని జూలై 2 లేదా మూడో తేదీన సమాధానమిస్తారు. ధన్యవాద తీర్మానానకి ఆమోదంతో పార్లమెంటు మొదటి సెషన్ ముగుస్తుంది. తిరిగి జూలై 22న సమావేశమవుతుంది. రెండో సెషన్‌లో కేంద్రప్రభుత్వం పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.