ఆటో వాలా సర్పంచ్.. గెలుచుకున్న ప్రజల మనస్సు

16-09-2026 | 12:31pm

జుక్కల్, సెప్టెంబర్ 16 (విజయ క్రాంతి): సాధారణంగా ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి ప్రజాప్రతినిధిగా ఎన్నికైన తర్వాత తన వృత్తిని కొనసాగించడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అయితే జుక్కల్ మండలంలోని చండేగాం గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఇందుకు భిన్నంగా నిలుస్తున్నారు. ఒకవైపు గ్రామ సర్పంచ్‌గా ప్రజలకు సేవ చేస్తూనే.. మరోవైపు తన జీవనాధారమైన ఆటోను నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

కొన్ని ఏళ్లుగా ఆటో నడుపుతూ వచ్చిన లక్ష్మణ్.. ఇటీవల సర్పంచ్‌గా గెలిచి గ్రామ ప్రజల మన్ననలు పొందారు. పదవి వచ్చిన తర్వాత కూడా తన వృత్తిని మాత్రం వదులుకోలేదు. ఇప్పటికీ మండల కేంద్రానికి ఏదైనా పని మీద రావాల్సి వస్తే తన ఆటోను తానే నడుపుకుంటూ వస్తుంటారు. అవసరమైతే జుక్కల్ మండల కేంద్రం నుంచి కామారెడ్డి జిల్లా కేంద్రానికి కూడా అదే ఆటోలో వెళ్లి వస్తుంటారు.

అత్యవసర వేళల్లో ఉచిత సేవ

లక్ష్మణ్ ప్రత్యేకత కేవలం ఆటో నడపడం, సర్పంచ్‌గా ఉండటంలోనే లేదు. అత్యవసర సమయంలో గ్రామ ప్రజలకు అండగా నిలవడం ఆయనకు అలవాటుగా మారింది. ముఖ్యంగా ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న మహిళలను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితుల్లో.. రాత్రి, పగలు అనే తేడా లేకుండా తన ఆటోతో ఉచితంగా ఆసుపత్రికి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.

ఆసుపత్రికి తీసుకెళ్లడమే కాకుండా.. అవసరమైన సమయంలో తిరిగి వారిని ఇంటికి కూడా చేర్చుతుంటారు. ఇందుకు ఎలాంటి డబ్బులు ఆశించకుండా సేవ చేయడం ఆయన ప్రత్యేకతగా గ్రామస్తులు పేర్కొంటున్నారు. 

పదవి వచ్చినా.. సాధారణ జీవితం

సర్పంచ్‌గా ఎన్నికైన తర్వాత కూడా లక్ష్మణ్ జీవనశైలిలో పెద్దగా మార్పు కనిపించదు. కొత్తగా ఆయనను చూసే వారికి అసలు ఈయనే గ్రామ సర్పంచ్ అని గుర్తించడం కూడా కష్టమేనని స్థానికులు అంటున్నారు. సాధారణ దుస్తుల్లో, అందరితో కలిసిమెలిసి ఉండే ఆయన.. గ్రామంలోని చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంటారు.

చిన్నపిల్లలు ఏదైనా సరదాగా మాట్లాడినా, అల్లరి చేసినా పెద్దగా పట్టించుకోకుండా వారితో స్నేహంగా మెలుగుతారు. గ్రామ ప్రజలకు అవసరమైన సమయంలో అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.

‘సర్పంచ్’ కంటే ముందు ‘ప్రజల మనిషి’

లక్ష్మణ్ విషయంలో సర్పంచ్ పదవి కంటే ప్రజలతో ఉన్న అనుబంధమే ముఖ్యంగా కనిపిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఒక సాధారణ ఆటో డ్రైవర్‌గా జీవితం ప్రారంభించి.. అదే ఆటోను తన జీవనాధారంగా కొనసాగిస్తూ ప్రజాప్రతినిధిగా ఎదగడం ప్రత్యేకంగా నిలుస్తోంది.

రాజకీయ పదవి వచ్చిన తర్వాత వృత్తిని, సాధారణ జీవనశైలిని పక్కన పెట్టకుండా.. తనకు చేతనైన విధంగా ప్రజలకు సేవ చేస్తూ ముందుకు సాగుతున్న లక్ష్మణ్ ప్రస్తుతం ‘ఆటో సర్పంచ్’గా స్థానికంగా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. సాధారణ జీవితం.. ప్రజలతో అనుబంధం.. అత్యవసర వేళల్లో సేవ.. ఇవే తన ప్రత్యేకతగా చేసుకుని ముందుకు సాగుతున్న జండేగం సర్పంచ్ లక్ష్మణ్ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

మరిన్ని వార్తలు