అవార్డులతో విద్యార్థులకు మరింత ఉత్సాహం
మునిసిపల్ చైర్ పర్సన్ సామినేని సుజాత రామనాథం
మధిర,మే 3౧ (విజయక్రాంతి): మధిర సేవా సమితి ఆధ్వర్యంలో పదవ తరగతి,ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు అందజేయడం అభినందనీయమని సామినేని సుజాత రామనాథం పేర్కొన్నారు. ఆదివారం మధిర వాసవి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొని విద్యార్థులను అభినందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ..,విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారిలో మరింత ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ఇటువంటి సత్కారాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. గత అనేక సంవత్సరాలుగా మధిర సేవా సమితి అనేక రకరకాల సేవా కార్యక్రమాలు చేయడంలో దాతలు సహకారం గొప్ప విషయమని అభినందించారు.
ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మధిర సేవా సమితి అధ్యక్షులు పల్లపోతు ప్రసాదరావు, మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు, వివిధ సంఘాల అధ్యక్షులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.






