24 August, 2026 | 9:51 PM

విద్యార్థులకు డ్రగ్స్, ర్యాగింగ్ సైబర్ నేరాలపై అవగాహన

24-08-2026 07:58 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేఘా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు మాదకద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలన, ర్యాగింగ్ నిరోధం, సైబర్ నేరాలపై ఘట్‌కేసర్ ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో సోమవారం పోలీస్ సిబ్బంది అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై శేఖర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ  యువత చెడు సావాసాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ వినియోగం, రవాణా చట్టరీత్యా తీవ్రమైన నేరమని, దీనివల్ల బంగారు భవిష్యత్తు నాశనమవుతుందని హెచ్చరించారు. కళాశాలల్లో ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

సీనియర్లు జూనియర్లతో స్నేహపూర్వకంగా మెలగాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు పంచుకోవద్దని, సైబర్ నేరాల బారిన పడితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని లేదా సైబర్ క్రైమ్ జిఓటి.ఇన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మేఘా కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.