విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధన అవకాశాల గురించి అవగాహన
ఘట్ కేసర్, మార్చి 18 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ట్రాన్స్ ఫార్మింగ్ హెల్త్ కేర్ విత్ ఎమర్జింగ్ ఫార్మా క్యూటికల్ రీసర్చ్ అనే అంశం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యునైటెడ్ కింగ్డమ్లోని క్వీన్స్ యూనివర్సిటీ బిల్ ఫాస్ట్ కు చెందిన ప్రొఫెసర్ డెమిట్రీయోస్ లాంఫ్రౌ ముఖ్య అతిథిగా హాజరై ఉపన్యాసం అందించారు.
ఆయన ప్రపంచవ్యాప్తంగా ఫార్మాస్యూటికల్ పరిశోధనలో జరుగుతున్న తాజా ధోరణులపై విపులంగా వివరించారు. ముఖ్యంగా 3డి ప్రింటింగ్, మైక్రోఫ్లూయిడిక్స్, స్కాఫోల్ టిష్యూస్, మైక్రోనీడిల్స్ వంటి ఆధునిక సాంకేతికతల ప్రాముఖ్యతను వివరించారు. అలాగే క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్లో ఉన్న ఉన్నత విద్య, పరిశోధన అవకాశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈసందర్భంగా అనురాగ్ యూనివర్సిటీ లైఫ్ సైన్సెస్ పరిశోధన విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ కుమార్ నెమ్మాని ఫార్మాస్యూటికల్ పరిశోధన రంగంలో ఉన్న విస్తృత అవకాశాలపై ప్రసంగించారు. స్కూల్ ఆఫ్ ఫార్మసీ డీన్ డాక్టర్ వసుధ బక్షి విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని, పరిశోధన రంగంలో మంచి కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రొఫెసర్లు, విద్యార్థులు మరియు పరిశోధకులు పాల్గొన్నారు.




