21 April, 2026 | 3:03 AM

ఇళ్ల గణనలో అవగాహన అవసరం

21-04-2026 01:54 AM

జిల్లా కలెక్టర్ హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 20(విజయక్రాంతి): జనాభా గణనలో భాగంగా చేప ట్టే ఇళ్ల గణన కార్యక్రమంలో ప్రతి అంశంపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

జనాభా గణన2027లో భాగంగా మొదటి విడతగా మే 11 నుంచి జిల్లాలో ఇళ్ల గణన చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంటి యజమానుల నుంచి సేకరించాల్సిన వివరాలపై స్పష్టతతో పనిచేసి ఎలాంటి పొరపాట్లు లేకుండా గణన నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, ట్రైనర్లు పాల్గొన్నారు.

అలాగే సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భసవేశ్వర జయంతి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భసవేశ్వరుడు 12వ శతాబ్దానికి చెందిన గొప్ప తత్వవేత్త, సంఘ సంస్కర్త అని తెలిపారు. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వం, ప్రేమ, భక్తి సందేశాలు అందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ లోకేశ్వర్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరుకుల్లా మంగ, అధికారులు పాల్గొన్నారు.

అలాగే వేసవి కాలంలో మారుమూల గ్రామాల ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ కార్యాలయాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు.

వేసవి దృష్ట్యా నీటి సరఫరాలో ఎక్కడైనా జాప్యం ఉంటే వెంటనే మరమ్మతులు చేసి నీటిని అందించాలని సూచించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.