8 May, 2026 | 5:54 PM

అపురూప ప్రదర్శన శాలలు

18-05-2024 12:05 AM

మ్యూజియం (వస్తు ప్రదర్శన శాల)లపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మే 18న ‘అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని’ జరుపుకుంటాం. దీనిని ‘ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియమ్స్’ 1977లో ప్రారంభించింది. జిల్లా కేంద్రాలు మొదలుకొని, దర్శనీయ ప్రాంతాలతోపాటు దేశవ్యాప్తంగా అనేక మ్యూజియంలు ఉన్నాయి. కానీ, వాటికి సరైన ఆదరణ లభించడం లేదు. గత కాలం వస్తువులను చూసిన వారికి చరిత్ర కళ్ల ముందు కదలాడుతుంది. 

పూర్వకాలం నాటి సంస్కృతి సాంప్రదాయాలు, ప్రజల జీవన విధానాలు, ఆనాటి వస్తువులు, అప్పటి తీపి గుర్తులను తరతరాలుగా భద్రపరిచి, భవిష్యత్ తరాలకు అం దించడానికి తోడ్పడే కేంద్రాలు ‘వస్తు ప్రదర్శన శాలలు’. పగిలిన కప్పులు, విరిగిన ఆయుధాలు, చెక్కు చెదరని కళాఖండాలు, టిప్పు సుల్తాన్ కత్తి, శివాజీ ఖడ్గం, బ్రహ్మనాయుడి ఆయుధం ఇలా నిక్షిప్తమైన వేల ఏళ్ల చరిత్రను కళ్లముందు ఆవిష్కరించే సాక్ష్యాల ను ఒకచోట కాపాడే కేంద్రాలుగా వీటి ప్రాధాన్యం ఎంతో ఉంటుంది. ఒక్కో వస్తువు వెనుక ఒక్కో చరిత్ర దాగి వుంటుంది.

ప్రపంచంలో వేలసంఖ్యలో మ్యూజియం లు ఉన్నాయి. మన దేశంలో ఉన్నవాటిలో ‘అతిపెద్ద మ్యూజియం’గా తెలంగాణలోని సాలా ర్ జంగ్ మ్యూజియంకు పేరుంది. ప్రజాదరణ పరంగా చూస్తే రాజస్తాన్‌లోని ‘హవామహల్’ దేశంలో మొదటిది. వస్తు ప్రదర్శన పరంగా ఢిల్లీలోని ‘జాతీయ మ్యూజియం’ అతి పెద్దది. ఇందులో సుమారు 2 లక్షలకుపైగా వస్తువు లు, ఐదు వేల ఏండ్ల క్రితానివి కూడా వాటిలో ఉన్నట్టు తెలుస్తున్నది. కోల్‌కతాలోని మ్యూజియం అతి పురాతనమైందిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఆరు విభాగాలుకాగా, అన్నీ చూడడానికి మూడు రోజులు పడుతుంది. 

- గడప రఘుపతిరావు