‘గప్‌చుప్’లతో జ్ఞానోదయం
‘గప్ చుప్’ అంటే ‘నిశ్శబ్దంగా ఉండండి’ అని కదా అర్థం. కానీ, ఆ అబ్బాయి అందరి ముందు నన్ను తిండిపోతుగా నిలబెట్టాడు. అతనికి సమాధా నం ఇవ్వడానికి నా దగ్గర ఎన్నో మాటలున్నాయి. కానీ, ఆ మాటల మూట నేను విప్పలేదు.
నాకు గప్‌చుప్‌లంటే చాలా ఇష్టం. ‘పానీ పూరి’ పేరుతో చిన్నలు, పెద్దలు వాటిని చాలా ఇష్టపడుతారు. నా అర్థాంగి ప్రమీలకు నాకిష్టమైన ఆహార పదార్థాలేవో బాగా తెలుసు. ఎక్కడైనా గప్‌చుప్‌ల బండి కనిపిస్తే కారును ఆపి ఆమెకు కూడా తినిపించే వాణ్ణి. నేను ఒంటరిగా వెళ్లేటప్పుడు ఏ గప్‌చుప్‌ల బండి దగ్గర కారు ఆపుతానోనని అనుమానం. అందుకే, ఆమె “మీరెక్కడ దొరికి తే అక్కడ గప్‌చుప్‌లు తినకండి. ఆరోగ్యం పాడవుతుంది” అని హెచ్చరిస్తుంది. ఆమె హెచ్చరికను నేను పట్టించుకుంటానా? ఆహారం గాని, విహారం గాని అవి చెప్పినట్లు మనం వినాలి తప్ప, అవి మన చేతిలో ఉండవు. మనస్సును నిగ్రహించుకున్న వారికి మాత్రమే ఏదైనా సాధ్యమ వుతుంది కదా. హైదరాబాద్ నగరంలో ‘ప్రగతి మహావిద్యాలయం’ గొప్ప విద్యాసంస్థ. అది నగరంలో నడిబొడ్డున ఆబిడ్స్‌కు సమీపంలో హనుమాన్ టేక్డీలో ఉంది. నేను ఆ కళాశాలలో చేరి అప్పటికి రెండే రోజులైంది. మంచి హుషారుగా ఉన్నాను. వందమందికిపైగా ఇంటర్వ్యూ కు వచ్చిన విద్యార్థుల్లో నేనొకణ్ణి తెలుగు లెక్చరర్‌గా సెలెక్టయిన వాణ్ణి.
కళాశాలలో చేరిన రెండో రోజు నా బాల్య స్నేహితుడు వావిలాల సత్యనారాయణ శాస్త్రి అమ్మనబ్రోలు నుంచి నగరానికి రాగా, నన్ను చూడడానికి కళాశాలకు ప్రత్యేకంగా వచ్చాడు. సాయంత్రం ఐదింటికి, కాలేజీనుంచి నేను అతనితో కలిసి బయటకు నడిచాను. కొత్తకొత్తగా ఉంది వాతావరణం. అది గుజరాతీ సంస్కృతికి ఆలవాలమైన కళాశాల. ఎక్కువమంది గుజరాతీ విద్యార్థులే ఉంటారు. కాలేజీ బయట గప్‌చుప్‌ల బండ్లు బారు లు తీరి ఉంటాయి. కాలేజీ నుంచి బయట పడగానే విద్యార్థులు బండ్ల చుట్టూ గుమి గూడడం సాధారణంగా జరుగుతుంది. అప్పటి ‘రాయల్ టాకీస్’ దాకా ఇదే పరిస్థితి. నా మిత్రుడు సత్యనారాయణశాస్త్రికి కూడా గప్‌చుప్‌లంటే ఇష్టం. అందుకే, “మనం తిందామా?” అనగానే ఆయన కూడా “ఓకే” అన్నాడు. ఇద్దరం ఒక బండిదగ్గర ఆగి ఆర్డర్ ఇచ్చాం. ఒక్కొక్కరం ఐదారు దాకా లాగేసి ఇంటి బాట పట్టాం. శాస్త్రిగారు నన్ను బస్సు డిపోదాకా రమ్మన్నాడు. నేను డిపోదాకా వెళ్లి వారిని బస్సె క్కించి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికి ప్రమీల “వేడివేడి పకోడి చేశాను, తింటారా?” అంది. అప్పుడు గుర్తుకు వచ్చింది నాకు లోగడ ఆమె చేసిన హెచ్చరిక. “మన శాస్త్రిగారు వచ్చారు. ఇద్దరం కలిసి గప్‌చుప్‌లు తిన్నాం. పకోడి ఇప్పు డు తినలేను” అన్నాను. “మీరు నా మాట లు వినరు కదా! శాస్త్రిగారిని ఇంటిదాకా ఎందుకు రమ్మనలేదు, చాలా రోజులైంది వారు మన ఇంటికి వచ్చి..” అంది. “తొందర పని ఉందని వెళ్లారు” అని సమాధా నం ఇచ్చాను ముక్తసరిగా.
అది మూడవ రోజు కళాశాలలో చేరి. క్లాసులో పిల్లలు నిశ్శబ్దంగా లేరు. కోలాహలంగా ఉంది క్లాసు. నేను కొత్తగా వచ్చి న లెక్చరర్‌ను కదా, నాతో అడ్జస్ట్ కావాలంటే కొంత సమయం పడుతుంది. అప్ప టికి క్లాసులో ప్రవేశించి ఐదు నిమిషాలైంది. అయినా విద్యార్థులు నన్ను పట్టిం చుకున్నట్లు అనిపించలేదు. నేను చూసిచూసి, “గప్ చుప్, గప్ చుప్! అందరూ సైలెంట్‌గా ఉండండి. ఏమిటీ అల్లరి?” అని గట్టిగానే అరిచాను. నా మాటలకు క్లాసులో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నది. నాకు సంతోషమైంది. నా మాటలు విని, వారంతా నిశ్శబ్దాన్ని పాటిస్తున్నారని. కానీ, అంతలోనే ఒక విద్యార్థి లేచి నిలబడ్డాడు. “ఎందుకు నిలబడ్డావు? ఏంటి చెప్పు..” అడిగాను అతణ్ణి. “నిన్న మీరు మీ స్నేహితునితో కలిసి గప్‌చుప్‌లు తిన్నారు కదా! వాటి రుచి ఎలా వుందో మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని నిలబడ్డాను సార్” అని ఆ అబ్బాయి సూటిగా నాకు జవాబిచ్చాడు. నేను ఒక్కసారిగా స్థాణువునై పోయాను. అసలు క్లాసులో నేను ‘గప్ చుప్’ అని అనకుండా ఉండవలసింది. కానీ, అనుకోకుండా ఆ మాట నా నోట వచ్చింది. ఆ మాట ఇంత పనిచేస్తుందని అనుకోలేదు.
‘గప్ చుప్’ అంటే ‘నిశ్శబ్దంగా ఉండం డి’ అని కదా అర్థం. కానీ, ఆ అబ్బాయి అందరి ముందు నన్ను తిండిపోతుగా నిలబెట్టాడు. అతనికి సమాధానం ఇవ్వడానికి నా దగ్గర ఎన్నో మాటలున్నాయి. కానీ, ఆ మాటల మూట నేను విప్పలేదు. “చాలా బాగున్నాయి. రుచికరంగా..” అని సమాధానం చెప్పి తప్పించుకున్నాను. కానీ, పిల్లల నవ్వులనుంచి తప్పించుకోలేక పోయాను. అర్థాంగి మాట పెడ చెవిన పెట్టడం వల్లనే ఇలా జరిగిందని నా మనసు చెప్పింది. మొత్తం మీద ఆ రోజు సంఘటన నన్ను ఎంతో ప్రభావితుణ్ణి చేసింది. ఆచార్యుడనే వాడు అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆహార విహారాల్లో నిగ్రహం పాటించాలి. ఏది పడితే అది తినడం అటుంచి, ఎక్కడ పడితే అక్కడ తినడం మానెయ్యాలి. చెప్పే మాటలకు చేసే పనులకు సమతుల్యత పాటించాలి. ఆచార్యు డు రెండు కళ్లతో ప్రపంచాన్ని చూస్తాడు కాని, ప్రపంచం అతణ్ణి వెయ్యి కళ్లతో చూస్తుంది! ఒక విధంగా గప్ చుప్‌ల వల్ల నాకు జ్ఞానోదయమైంది. అర్థాంగి చెప్పిన మాట ల్ని అర్థం చేసుకొని నడిస్తే, ఆచార్యులకు కూడా ఏ ఇబ్బందులూ వుండవని అర్థమైంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా రోడ్డుమీద గాని, రోడ్డు పక్కన గాని ఏదైనా తింటానికి వెనుకాడడం నావంతైంది.
ఆచార్య మసన చెన్నప్ప
వ్యాసకర్త సెల్: 9885654381






