బీజేపీ ఓట్ల పాట్లు
ఎన్నికల్లో గెలుపు కోసం భారతీయ జనతా పార్టీ మళ్లీ హిందుత్వ బాటనే ఎంచుకొంది. ప్రధాని నరేంద్ర మోడీసహా బీజేపీ అగ్రనేతలు ఈమధ్య ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే అది నిజమనిపిస్తుంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీలు గనుక మళ్లీ అధికారంలోకి వస్తే అయోధ్యలోని రామమందిరంపైకి బుల్డోజర్లు పంపిస్తాయేమోనని అన్నారు. ‘శ్రీరామనవమి నాడు సమాజ్‌వాది పార్టీకి చెందిన సీనియర్ నాయకుడొకరు అయోధ్యలో రామమందిరం పనికి రానిదన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ రామమందిరంపై సుప్రీంకోర్టు తీర్పును తలకిందులు చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎస్పీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే వాళ్లు రామ్ లల్లాను మళ్లీ టెంట్‌లోకి పంపిస్తారు. అలాగే రామమందిరంపైకి బుల్‌డోజర్లు పంపిస్తారు’ అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేకాదు, బుల్‌డోజర్లు ఎక్కడ ప్రయోగించాలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ను చూసి నేర్చుకోండంటూ ఆ పార్టీలకు ఉచిత సలహా కూడా ఇచ్చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానైనా ప్రధాని విపక్షాలపై ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అందులో ఉత్తరప్రదేశ్‌లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం మరీ వింతగా ఉంది. ఉత్తరాది వాళ్లు ఏ చిన్నపాటి అంశంపైనైనా తీవ్రంగా స్పందిస్తారు. గతంలో బీజేపీ అగ్రనేత అద్వానీ అయోధ్య అంశంపై చేపట్టిన రథయాత్ర దేశవ్యాప్తంగా హిందువుల్లో ఎంత భావోద్వేగాలను రెచ్చగొట్టిందో అందరికీ తెలిసిందే. పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి కూడా అదే సెంటిమెంట్ కారణమైందనేది రాజకీయ పండితుల అభిప్రాయం. ఈసారి లోక్‌సభ ఎన్నికలు ముందు అదే అయోధ్య సెంటిమెంట్‌తో ఓట్లు కొల్లగొట్టవచ్చని కమలనాథులు భావించారు. అందుకే, ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందుగానే హడావుడిగా అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిపించేశారు. ప్రతిపక్షాల విమర్శలను సైతం లెక్క చేయకుండా ఆ పార్టీ తన అజెండాను నిర్విఘ్నంగా పూర్తి చేసింది. దీంతో ఒక దశలో దేశంలో సగం ఎన్నికలను రామమందిరం పూర్తి చేసేసిందన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. అందుకే కమలనాథులు ‘అబ్‌కీ బార్ 400 పార్’ అన్న నినాదాన్ని అందుకున్నారు కూడా.
అయితే, ఇదంతా ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందు మాట. తీరా షెడ్యూల్ వెలువడిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అయోధ్య అంశం అసలు ప్రధాన అంశమే కాకుండా పోవడంతో బీజేపీ రకరకాల అంశాలను తెరమీదికి తెచ్చింది. వాటిలో ప్రధానమైంది ముస్లింల రిజర్వేషన్ల అంశం. ఇది కూడా ఎమోషన్‌ను పండించేదే. ఎన్నికలకు ముందు బీజేపీ ఇలాంటి అంశాలను తెరమీదికి తెస్తుందన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి రావడం, ప్రజల్లోనూ అదే భావన ఉండడంతో అదికూడా పెద్దగా పని చేయలేదు. అలాగే, దేశంలో ఆస్తులను కాంగ్రెస్ ఒక వర్గానికే కట్టబెడుతుందంటూ చేసిన ప్రచారమూ బెడిసి కొట్టింది. ఇలా రకరకాల అంశాలు పని చేయకుండానే సగం ఎన్నికలు ముగిసి పోయాయి. ఇప్పటి వరకు గాలి తమకు అనుకూలంగా లేదన్న విషయం బీజేపీ నేతలకు అర్థమైపోయిందని విశ్లేషకులు అంటున్నారు. అందుకనే, మళ్లీ భావోద్రేకాలతో ముడిపడిన అంశాలను తెరమీదికి తెస్తోంది. ఇక మిగిలిన స్థానాలన్నీ కీలకమైన యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి సెంటిమెంట్ బాగా పనిచేసే రాష్ట్రాలే కావడంతో ఆ ప్రాంతాలలో స్థానికంగా ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశాలనే లేవనెత్తుతున్నారు. బీహార్, సీతామర్హిలో ఓ సభలో అమిత్ షా తాము మళ్లీ అధికారంలోకి వస్తే సీతాదేవి పుట్టినిల్లుగా భావించే ఈ ప్రాంతంలో సీతాదేవికి ఓ భవ్య మందిరం నిర్మిస్తామని ప్రకటించారు. మిగిలిన మూడు విడతల ఎన్నికలు ముగిసేలోగా ఓట్ల కోసం ఇలాంటి ప్రకటనలను ఎన్ని చేస్తారో చూడాలి. అయినా, ఫలితం ఉంటుందో లేదో తేలాలంటే జూన్ 4 దాకా వేచివేచి చూడాలి.






