5 August, 2026 | 5:56 PM

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

05-08-2026 04:43 PM

బెజ్జంకి: సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులకు వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు, పాస్‌వర్డ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సిద్ధిపేట రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ సూచించారు. సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సురక్ష కా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ వైపు నినాదంతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం రేగులపల్లి గ్రామంలోని సెయింట్ విన్సెంట్ పల్లోటి పాఠశాలలో ఎస్‌ఐ తోట తిరుపతి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని సీఐ విద్యాసాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైబర్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించి, మానవహారంగా నిలబడి సైబర్ నేరాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు.